Share News

సమస్యల్లో సంక్షేమ హాస్టళ్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:43 AM

అన్నమయ్య జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో వసతుల పరిస్థితి తీసికట్టుగా లేకున్నా విద్యార్థుల హాజరు పల్చగా కనిపిస్తోంది. రికార్డుల్లో ఉన్నంత మంది హాస్టళ్లలో ఉండటం లేదు.

సమస్యల్లో సంక్షేమ హాస్టళ్లు
గుర్రంకొండ ఎస్సీ హాస్టల్‌లో మరమ్మతులకు గురైన చేతిపంపు

అన్నమయ్య,జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో వసతుల పరిస్థితి తీసికట్టుగా లేకున్నా విద్యార్థుల హాజరు పల్చగా కనిపిస్తోంది. రికార్డుల్లో ఉన్నంత మంది హాస్టళ్లలో ఉండటం లేదు. జిల్లాలో 43 ఎస్సీ హాస్టళ్లు ఉండగా అందులో 3,306 మంది విద్యార్థులున్నారు. 38 బీసీ హాస్టళ్లలో 2,396 మంది ఉన్నారు. 10 ఎస్టీ హాస్టళ్లలో 1,093 మంది ఉన్నారు. మొత్తం 6,741 మంది వసతి పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా హాస్టళ్లను శనివారం ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌ పరిశీలించగా వెల్లడైన అంశాలను పరిశీలిస్తే...

బి.కొత్తకోట బీసీ హాస్టల్‌లో 50 మంది విద్యార్థులు ఉండవచ్చు. ప్రసుత్తం 8 మంది ఉండగా ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. స్కూల్‌ నుంచి హాస్టల్‌ చాలా దూరంగా ఉండటంతో విద్యార్థులు రాలేకపోతున్నారని తెలిసింది. వసతుల సమస్య లేకున్నా హాజరు శాతం బాగా తక్కువగా ఉంది.

తంబళ్లపల్లె ఎస్టీ గురుకుల పాఠశాలలో 40 మందికి గాను 23 మంది మాత్రమే హాజరయ్యారు.. ఇక్కడ హాస్టల్‌ కిటికీలకు మెష్‌లు లేవు.

ములకలచెరువు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 57 మందికి గానూ 36 మంది హాజరయ్యారు. రెగ్యులర్‌ వార్డన్‌ లేరు. మదనపల్లెకు చెందిన వార్డన్‌ ఇన్‌ ఛార్జ్‌గా ఉన్నారు.

చిన్నమండెంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 59 మందికి గాను 20 మంది టిఫిన్‌కు హాజరయ్యారు. మిగిలిన వాళ్లు సెలవుల కోసం వెళ్లి ఇంకా రాలేదని వార్డెన్‌ తెలిపారు.

ఫ పెద్దతిప్పసముద్రం బీసీ బాలుర వసతి గృహంలో 25 మంది విద్యార్థులకు గాను 11 మంది మాత్రమే హాజరయ్యారు. వసతులు బాగున్నాయని విద్యార్థులు చెప్పారు.

వాల్మీకిపురంలోని బీసీ బాలికల వసతి గృహ భవనం వర్షమొస్తే ఉరుస్తోంది.

పుంగనూరు బీసీ హాస్టల్‌లో కిటికీలకు మెష్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గదుల పైపెచ్చులు ఊడటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

మదనపల్లె ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని 25 ఏళ్లుగా అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. పైభాగం రేకుల షెడ్డు కావడంతో విద్యార్థులు చలికి ఇబ్బంది పడుతున్నారు.

పీలేరు బాలుర ఎస్టీ గురుకులంలో డార్మెటరీ, తరగతి గదులు, రాత్రి బస ఇరుకు రేకుల షెడ్లే.. 62 మంది విద్యార్థులున్నా కనీస వసతులు లేవు.

పెద్దమండ్యం మండలం కలిచెర్ల బీసీ హాస్టల్‌ 20 ఏళ్లుగా అద్దె భవనంలోనే నడుస్తోంది. ఒకటే మరుగుదొడ్డి ఉంది. డైనింగ్‌ హాలుకు కిటీకీ తలుపులు లేవు.

లక్కిరెడ్డిపల్లె మండలంలో రెండు ఎస్సీ హాస్టళ్లు, రెండు బీసీ హాస్టళ్లు, ఒక ఎస్సీ, ఒక బీసీ బాలికల హాస్టల్‌ ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో వసతులు సక్రమంగా లేవు. భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త భవనాలకు రూ.45లక్షలు మంజూరైనా పనులు మొదలు కాలేదు. ఒకటవ హాస్టల్‌లో తాగునీటికి ఇబ్బందిగా ఉంది. బీసీ బాలికల హాస్టల్‌లో చేతిపంపు నీళ్లు తాగుతున్నారు.

పెద్దమండ్యం మోడల్‌ స్కూల్‌ బాలకల హాస్టల్‌లో వంద మంది విద్యార్థినులు ఉన్నారు. బాత్రూం నిండిపోవడంతో వారం, రెండు వారాలకు ఒకసారి మోటార్‌ ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. మరమ్మతులకు నిధులు వచ్చాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 12:43 AM