Share News

జీవితాంతం రుణపడి ఉంటాం సార్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 02:07 AM

నిషేదిత 22ఏ జాబితా నుంచి భూములకు విముక్తి కల్పించినందుకు ఆవులపల్లె రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమరావతిలో వీరు సీఎంను కలిశారు.

జీవితాంతం రుణపడి ఉంటాం సార్‌
సీఎం చంద్రబాబు నుంచి భూముల ఉత్తర్వు కాపీ అందుకుంటున్న రైతులు

22ఏ నుంచి భూముల విముక్తి ఉత్తర్వులు

అందుకున్న ఆవులపల్లె బాధిత రైతులు

సీతమ్మచెరువు కట్ట పునరుద్ధరణకు ప్రతిపాదనలు

ఆనందం వ్యక్తం చేసిన అన్నదాతలు

పుంగనూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): నిషేదిత 22ఏ జాబితా నుంచి భూములకు విముక్తి కల్పించినందుకు ఆవులపల్లె రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమరావతిలో వీరు సీఎంను కలిశారు. 22ఏ నుంచి 911.74 ఎకరాల భూములకు విముక్తి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం నుంచి అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. సీతమ్మ చెరువు కట్టపై ఆవులపల్లె బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించి మూడుపంటలు పండే వేలాది ఎకరాలు నీటిముంపునకు గురిచేసి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధిత రైతులు సీఎంకు వివరించారు. అక్రమ కేసులు పెట్టారని, 1బీ రాకుండా రెవెన్యూ రికార్డుల తారుమారు చేయించి వేధించారన్నారు. ఈక్రమంలో కూటమి ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీతమ్మ చెరువు కట్టను తెంచేసి రిజర్వాయర్‌ కట్టాలనుకోవడంతో ఇప్పటికి నాలుగు మార్లు వర్షాలు పడినా నీరు నిల్వలేదు. కాగా రూ.19.73 కోట్లతో ఈ చెరువుకట్ట పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి జలవనరులశాఖకు పంపారని రైతులు చెప్పారు. ఈసందర్భంగా ఆవులపల్లె రైతులు లక్ష్మీపతి నాయుడు, తదితరులు మాట్లాడుతూ సీతమ్మ చెరువుతో పాటు తమ భూములు మళ్లీ పూర్వస్థితికి వస్తుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 02:07 AM