Share News

స్వర్ణ రథం ఎత్తు పెంచుతాం

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:52 AM

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ రథాన్ని ఎత్తు పెంచడానికి ఆలయ బోర్డు తీర్మానించింది, మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది.

స్వర్ణ రథం ఎత్తు పెంచుతాం
సమావేశంలో మాట్లాడుతున్న ఈవో పెంచలకిషోర్‌

పుష్కరిణిని ముందుకు జరపడానికి త్వరలో తీర్మానం

దళిత సత్రానికి రూ.50 లక్షలు, మరగదాంబిక కల్యాణ మండపంలో రెండు బ్లాకుల కేటాయింపు

కాణిపాక ఆలయ బోర్డు సమావేశంలో తీర్మానాలు

ఐరాల(కాణిపాకం), మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ రథాన్ని ఎత్తు పెంచడానికి ఆలయ బోర్డు తీర్మానించింది, మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచలకిషోర్‌ మాట్లాడుతూ.. సమావేశంలో 16 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. స్వర్ణరథంపై స్వామి వారు విహరించే సమయంలో చాలా మంది భక్తులకు స్వామి దర్శనం కావడం లేదని చెప్పారన్నారు. దీంతో రథం ఎత్తును 2.6 అడుగులు పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికోసం బీహెచ్‌ఈఎల్‌ వారు రథాన్ని పరిశీలించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి అందించిన 18.60 ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం కోసం సరిహద్దు రాళ్లు నాటనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులలో భాగంగా ఆలయం ముందున్న పుష్కరిణిని ముందు జరపడానికి బోర్డు తీర్మానించినట్లు ఈవో తెలిపారు. గతంలో ఆలయ అవసరం కోసం దళితుల సత్రాన్ని తీసుకున్నట్లు గుర్తుచేశారు. దీనికి ప్రత్యామ్యాయంగా మరగదాంబిక కల్యాణ మండపాలలో రెండు బ్లాకు కేటాయించి వారికి రూ.50 లక్షలు అందించడానికి తీర్మానించినట్లు తెలిపారు. కల్యాణ మండపానికి రూ. 10 లక్షలతో మరమ్మతులు, రంగులు వేయడానికి తీర్మానం చేసినట్లు తెలిపారు. దీనికి ప్రభుత్వ అనుమతి లభించాక పనులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఆలయ బోర్డు సభ్యులు ఊట్లనాగరాజునాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి,సుధాకర్‌రెడ్డి, నరేష్‌, శివప్రసాద్‌, సుబ్రహ్మణ్యంరెడ్డి, సతీష్‌, చంద్రకళ, అనసూయ, వసంత, సునీత, సంధ్యారాణితో పాటు ఈఈ వెంకటనారాయణ, డీఈవో సాగర్‌బాబు, ఏఈవోలు ప్రసాద్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 01:52 AM