పరిశ్రమలకు భూములివ్వం
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:42 AM
ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకు తమ భూములిచ్చేది లేదని గుడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామస్తులు తెగేసి చెప్పారు. గ్రామసభ నిర్వహంచడానికి వీల్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.
పొగురుపల్లిలో అధికారులను అడ్డుకున్న రైతులు
తమ పొట్టకొట్టవద్దంటూ గ్రామసభలో నిరసన
గుడుపల్లె, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకు తమ భూములిచ్చేది లేదని గుడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామస్తులు తెగేసి చెప్పారు. గ్రామసభ నిర్వహంచడానికి వీల్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. పొగురుపల్లె సమీపంలో ఎడిడాస్ కంపెనీ ఏర్పాటుకు 94 ఎకరాలు, ఏతర్ బ్యాటరీ కంపెనీకి 130 ఎకరాలను సేకరించేందుకు ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. రైతుల అభిప్రాయ సేకరణకు గ్రామ సచివాలయ ఆవరణలో గురువారం గ్రామసభ నిర్వహించనున్నట్టు రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. ఈక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరాజు, తహసీల్డారు సీతారామ్ గ్రామసభ గ్రామసభ నిర్వహణకు బయలుదేరగా.. వేదిక చేరుకోకముందే పలువురు రైతులు అడ్డుకున్నారు. గ్రామసభ జరపరాదంటూ రోడ్డుపై బైఠాయించారు. తమకు జీవనాఽధారమైన భూములను తీసుకొని కడుపులు కొట్టొద్దంటూ వేడుకున్నారు. గ్రామసభ వద్దంటూ నినాదాలు చేశారు. ఆర్డీవో శ్రీనివాసరాజు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. గ్రామసభ నిర్వహణకు సహకరించాలని కోరారు. అభిప్రాయాలను జిల్లా కలెక్టరుకు నివేదిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. తర్వాత సచివాలయం ఎదుట గ్రామసభ జరిగింది. ‘చిన్న, సన్నకారు రైతులం 200 మందికిపైగా ఉన్నాం. మాకు ఆ భూములతోనే బతుకులు సాగుతున్నాయి. ఈ భూములు పరిశ్రమకు ఇస్తే మా కుటుంబాలు వీధిన పడతాయి. గతంలో ఇక్కడ పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడున్నారు. అందుకని మా భూములను లాక్కోవద్దు’ అని రైతులు గ్రామసభలో ఆర్డీవోకు విన్నవించారు. వీటిని కలెక్టరు దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పారు.