పవిత్రత విషయంలో రాజీ పడం
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:17 AM
ఆధ్యాత్మికత, ఆదునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణల సమ్మేళనంగా తిరుపతి, తిరుమల ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తిరుపతి/తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):ఆధ్యాత్మికత, ఆదునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణల సమ్మేళనంగా తిరుపతి, తిరుమల ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. తిరుపతి పవిత్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో చాలావరకూ ప్రక్షాళన చేశామని, అలా ఎవరైనా రాజీ పడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.రూ. 3222 కోట్ల టీటీడీ-తుడా నిధులతో చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జాతీయ రహదారులతో లింక్ చేస్తూ నగర రోడ్లను అభివృదిఽ్ధ చేయాలని సూచించారు. ఐతేపల్లి, రంగంపేటలకు రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ద్వారా బెంగళూరు-తిరుపతి, తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారులను లింక్ చేయవచ్చునన్నారు. గ్రేటర్ తిరుపతి ఏర్పాటైతే లింక్ రోడ్ల వల్ల నగరం వెలుపలి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని సూచించారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి నుంచీ శ్రీసిటీకి కొత్తగా రోడ్డు నిర్మిస్తే ఆ మార్గంలోని మారుమూల ప్రాంతాలన్నీ వెలుగులోకి వస్తాయని, అభివృద్ధి చెందడానికి అవకాశం వుంటుందని సూచించారు. తిరుపతిలోని అన్ని చెరువులనూ అభివృద్ధి చేయాలని, వాటిని సుందరీకరించి చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెల్లవారుజామున వాకింగ్ ట్రాక్‌ల వెంబడీ వెంకటేశ్వర సుప్రభాతం వినిపించే ఏర్పాటు చేయాలని, సుప్రభాతం వింటూ వాకింగ్ చేయడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ ఏడాదిలోనే కళ్యాణి డ్యామ్‌కు హంద్రీ-నీవా జలాలు తెస్తామన్నారు. రెండు మూడేళ్ళలో తిరుపతికి కూడా హంద్రీ-నీవా జలాలను అందిస్తామన్నారు. తిరుపతిని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి పరచాల్సి వుందన్నారు. తిరుపతి పవిత్రతను కాపాడడంతో పాటు అభివృద్ధికి సంబంధించి టీటీడీపై ఎంతో బాధ్యత వుందన్నారు. టీటీడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు పన్నులు చెల్లించడం ద్వారా వచ్చే నిధులతో నగరాభివృద్ధి సులువవుతుందన్నారు.రిలయన్స్ వంతారా తరహాలో తిరుపతి ఎస్వీ జూపార్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. కాగా కలెక్టర్ తిరుపతి నగరం చుట్టూ రోడ్ల కనెక్టివిటీ గురించి వివరించే సమయంలో జోక్యం చేసుకున్న సీఎం చంద్రబాబు పలు ప్రతిపాదనలు చేశారు. కళ్యాణి డ్యామ్ నుంచీ తిరుమల గిరుల పాద భాగాన కరకంబాడి వద్ద బాలాజీ రిజర్వాయర్ మీదుగా కడప-రేణిగుంట జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఏర్పేడు వద్ద ఐఐటీ, ఐసర్ వంటి ఉన్నత విద్యా సంస్థలు నడుస్తుండడానికి తోడు సెమీ కండక్టర్ పరిశ్రమ కోసం పది వేల ఎకరాలు సేకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని అభివృద్ధికి గల అవకాశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
శెట్టిపల్లెలో రిలయన్స్ వంతారాకు 20 ఎకరాలు!
కలెక్టర్ శెట్టిపల్లె భూముల గురించి వివరిస్తూ శెట్టిపల్లె టౌన్‌షి్‌పలో 2200 ప్లాట్లు పోనూ మిగిలిన భూమిలో తుడాకు 65 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. దాన్ని పీపీపీ మోడల్‌లో మూడవ పక్షానికి కేటాయించి లేఅవుట్ వేసి విక్రయించడం ద్వారా వచ్చిన నిధులతో టౌన్‌షి్‌పకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం వద్ద మరో 90 ఎకరాలు వుందన్నారు. అందులో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం 20 ఎకరాలు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం వద్ద వున్న 90 ఎకరాల్లో 15-20 ఎకరాలను రిలయన్స్ వంతారాకు కేటాయించాలని ఆదేశించారు. అందులో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారన్నారు. మిగిలిన భూములను ఐటీ రంగానికి కేటాయించాలని సూచించారు. అక్కడ ఐటీ పార్కులు, హోటళ్ళు, అన్ని రకాల స్పోర్ట్స్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. తద్వారా తిరుపతిలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా ఊపందుకుంటాయన్నారు. వీటన్నింటితో తిరుపతి స్థాయి తదుపరి దశకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలివే
అలిపిరి సమీపాన రూ. 2700 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టూరిజం టౌన్‌షి్‌ప నిర్మాణానికి,వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 418 ఎకరాల్లో రూ. 230 కోట్లతో 5192 మంది టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాల లేఅవుట్ అభివృద్ధి పనులకు,తిరుపతిలో తుడా ద్వారా రూ. 242 కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
వర్చువల్‌గా పాల్గొన్న మంత్రులు, ముఖ్యులు
సీఎం చంద్రబాబు అమరావతి నుంచీ వర్చువల్‌గా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు వేర్వేరు చోట్ల నుంచీ వర్చువల్‌గా పాల్గొన్నారు. అలాగే టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు సైతం తిరుమల నుంచీ వర్చువల్‌గా హాజరయ్యారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకా్‌షరెడ్డి, శాంతారామ్, జ్యోతుల నెహ్రూ, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, తుడా ఛైర్మన్ దివాకర రెడ్డి, టీడీపీ నేత హేమాంబరధర రావు, టీటీడీ చీఫ్ పీఆర్వో రవికుమార్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ తదితరులతో పాటు టీటీడీకి చెందిన పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.