జిల్లాను మైనింగ్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:14 AM
‘జిల్లాలో వ్యవసాయం తర్వాత మైనింగ్ రంగం కీలకమైంది.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో వ్యవసాయం తర్వాత మైనింగ్ రంగం కీలకమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో స్తంభించిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతాం. మైనింగ్ రంగంలో జిల్లాను తిరిగి అగ్రగామిగా తీర్చిదిద్దుతాం’ అని గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలోని మైనింగ్ పురోగతి, సమస్యలపై అధికారులు, క్వారీ యజమానులతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సమీక్షించారు. జిల్లాలో 682 మైనింగ్ లీజులు ఉండగా, వాటిలో 50శాతం మాత్రమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. 500- 600 మధ్య ఖనిజ ఆధార పరిశ్రమలున్నా.. వివిధ కారణాలతో చాలావరకు పనిచేయడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఖనిజాధారిత పరిశ్రమలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. వడ్డెర్లకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి.. వడ్డెర సహకార సంఘాలకు 50శాతం రాయితీతో క్వారీ లీజులు అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అర్హత కలిగిన మరిన్ని సంఘాలకూ అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర గనుల ఆదాయం సుమారు రూ.3వేల కోట్లకు చేరుకోవడంతో 40శాతం వృద్ధి నమోదైందన్నారు. లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, బీచ్ శాండ్ మినరల్స్ వంటి ఖనిజ వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 12 బ్లాకులను గుర్తించి దశలవారీగా వేలాలు నిర్వహించి, వాటిని ఉత్పత్తిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. క్వారీ, గ్రానైట్ పరిశ్రమల సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయిస్తామన్నారు. కలర్ గ్రానైట్ రంగంలో రాయల్టీ తదితర కారణాల వల్ల నష్టపోతున్నట్లు పలువురు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తామని చెప్పారు. మైనింగ్‌కు సంబంధించి అటవీ అనుమతులు, రెవెన్యూ, ఎన్‌వోసీ మంజూరులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. గత ఐదేళ్లలో నిస్తేజమైన ఈ పరిశ్రమను.. పునరుత్తేజపరిచి ఉపాధి అవకాశాలు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, మైనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.