రెండు నెలల్లో బ్లాక్‌స్పాట్లను సరిచేస్తాం
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:48 AM
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది.మంగళవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వద్ద ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, నేషనల్ హైవే అధికారులతో కలిసి బస్సు యాత్రను కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు.
నేండ్రగుంట నుంచి తడ వరకూ
ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది.మంగళవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వద్ద ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, నేషనల్ హైవే అధికారులతో కలిసి బస్సు యాత్రను కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో సగటున ఏటా 550 నుంచి 560మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, తిరుమలకు పెరుగుతున్న బక్తుల రాక, దూర ప్రయాణాలు, అతి వేగం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగించకపోవడం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ తదితర కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా గత ఏడాది రెండు అంతకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన 48 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించడం జరిగిందన్నారు.అనంతరం వారంతా పాకాల మండలం నేండ్రగుంట ,రేణిగుంట,గాజులమండ్యం, శ్రీకాళహస్తి,సూళ్లూరుపేట,నాయుడుపేట,ఓజిలి,తడ,శ్రీసిటీ ప్రాంతాల్లో పర్యటించి బ్లాక్‌స్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. వరకూ బ్లాక్‌స్పాట్లను సీఎం ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని బ్లాక్‌స్పాట్లను వంద శాతం సరిదిద్దే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సమగ్ర కార్యాచరణతో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏఎస్పీ రవి మనోహరాచారి, జిల్లా రవాణాశాఖాధికారి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.