Share News

పొడి చెత్త కొంటాం

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:50 AM

ఇంటింటా తడి చెత్తను సేకరిస్తున్నారు. పొడిచెత్త, వ్యర్థాలనేమో పడేస్తున్నారు. ఇవి మట్టిలో కలిసేందుకు ఏళ్ల సమయం తీసుకుంటుంది. మరికొందరేమో ఈ వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోంది. పారిశుధ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పల్లెల స్వచ్ఛత, పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ రథాలను తీసుకొచ్చింది.

పొడి చెత్త కొంటాం
జడీనెల్లూరులో మండలంలో జెండా ఊపి స్వచ్ఛరథాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు

మండలానికో స్వచ్ఛరథం కేటాయింపు

శనివారమే 55 ప్రారంభం

రేపటి నుంచి గ్రామాల్లో మొదలుకానున్న సేవలు

ఇంటింటా తడి చెత్తను సేకరిస్తున్నారు. పొడిచెత్త, వ్యర్థాలనేమో పడేస్తున్నారు. ఇవి మట్టిలో కలిసేందుకు ఏళ్ల సమయం తీసుకుంటుంది. మరికొందరేమో ఈ వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోంది. పారిశుధ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పల్లెల స్వచ్ఛత, పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ రథాలను తీసుకొచ్చింది.

- చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి

గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా గ్రామాల్లో పొడి చెత్త సేకరణ నిమిత్తం ప్రభుత్వం స్వచ్ఛరథాలను ప్రవేశపెట్టింది. పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో పారిశుధ్య కార్మికులు వ్యర్థాలను తగలబెడుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ క్రమంలో స్వచ్ఛరథాలను తీసుకొచ్చారు. గతంలో ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే ఎండీయూ వాహనాలనే స్వచ్ఛరథాలుగా మార్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాలకు సంబంధించి తొలుత రెండు మండలాలకు స్వచ్ఛరథాలిచ్చారు. ఆ తర్వాత చిత్తూరు రూరల్‌, ఐరాల, బంగారుపాళ్యం, మదనపల్లె, శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు, చంద్రగిరి మండలాలకు ఒక్కోటి చొప్పున 8 స్వచ్ఛరథాలను కేటాయించారు. వీటి ఫలితాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో శనివారం 55 స్వచ్ఛరథాలను ప్రారంభించారు. కార్వేటినగరంలో ఎమ్మెల్యే థామస్‌, గంగాధర నెల్లూరులో జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు జెండా ఊపి స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. జీడీనెల్లూరు కార్యక్రమంలో డీపీవో సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. దీంతో మండలానికో స్వచ్ఛరథం చేరింది. ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఈ వాహనం తిరుగుతూ ప్రజల నుంచి నిర్దేశించిన వ్యర్థాలు, వస్తువులు సేకరించాల్సి ఉంటుంది. ఈ రథాలు ఎప్పుడు ఏయే గ్రామాల్లో తిరగాలనేది ఎంపీడీవోలు షెడ్యూల్‌ చేస్తారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు రథాల పనితీరును పర్యవేక్షిస్తారు. ప్రతి వాహనానికి జీపీఎస్‌ ట్రాకర్‌ను అమర్చి పర్యవేక్షిస్తామని జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు చెప్పారు.

స్వచ్ఛరథం నిర్వహణ ఇలా..

స్వచ్ఛరథం నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.25 వేల చొప్పున అందిస్తుంది. దీన్ని 15వ ఆర్ధిక సంఘ నిధులు, మండల పరిషత్‌ నిధుల ద్వారా అందజేస్తారు. నిర్వాహకుడు కిలో పాత ఇనుముకు రూ.20, పాత పేపర్లకు రూ.15, పుస్తకాలకు రూ.10, అట్టపెట్టెలకు రూ.10, ప్లాస్టిక్‌ సీసాలకు రూ.20, గాజుసీసాలకు రూ.2, స్టీలు వస్తువులకు రూ.20, అల్యూమినియానికి రూ.120 చొప్పున కొనుగోలు చేయాలి. లేదా పొడి చెత్త విలువకు తగినట్లు సరుకులూ ఇస్తారు. వాహనంలో డిజిటల్‌ తుకాల మిషన్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 22 , 2026 | 01:50 AM