జిల్లా కోర్టును పేల్చేస్తాం
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:30 AM
మధ్యాహ్నం 1.30- 2 గంటల మధ్య జిల్లా కోర్టును పేల్చేస్తాం’ అంటూ ఈ- మెయిల్ రావడంతో కలకలం రేగింది. చిత్తూరు జిల్లాకోర్టు సముదాయాల్లో పలు కోర్టులు ఉన్నాయి. జిల్లా కోర్టు పరిధిలో ఉన్న ఈ-కోర్టుకు మంగళవారం తమిళనాడు రాష్ట్రం నుంచి బాంబులతో కోర్టును పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చింది. దీనిని చూసిన ఈ-కోర్టు సిబ్బంది జిల్లా జడ్జికి సమాచారం అందించారు. ఎస్పీతో పాటు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులకు జిల్లా జడ్జి అరుణ సారిక సమాచారం ఇచ్చారు.
అగంతకుల నుంచి ఈ-కోర్టుకు మెయిల్
భయంతో బయటకు వచ్చిన సిబ్బంది, కక్షిదారులు
చివరకు ఫేక్‌గా తేల్చిన పోలీసులు
రెండోసారి బాంబు బెదిరింపు
చిత్తూరు లీగల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ’మధ్యాహ్నం 1.30- 2 గంటల మధ్య జిల్లా కోర్టును పేల్చేస్తాం’ అంటూ ఈ- మెయిల్ రావడంతో కలకలం రేగింది. చిత్తూరు జిల్లాకోర్టు సముదాయాల్లో పలు కోర్టులు ఉన్నాయి. జిల్లా కోర్టు పరిధిలో ఉన్న ఈ-కోర్టుకు మంగళవారం తమిళనాడు రాష్ట్రం నుంచి బాంబులతో కోర్టును పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చింది. దీనిని చూసిన ఈ-కోర్టు సిబ్బంది జిల్లా జడ్జికి సమాచారం అందించారు. ఎస్పీతో పాటు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులకు జిల్లా జడ్జి అరుణ సారిక సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ తమ విధులను పక్కనపెట్టి కోర్టుబయటకు వచ్చేశారు. అదే సమయంలో ఎస్పీ తుషార్ డూడీ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్లు, ఇతర సిబ్బంది హుటాహుటిన కోర్టు సముదాయానికి చేరుకున్నారు. కోర్టు సముదాయాల్లోని అందరినీ బయటకు పంపించారు. కోర్టుతో పాటు పరిసరాల్లోనూ క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఇది ఫేక్ బెదిరింపుగా నిర్ధారించారు. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది సాయంత్రం 4 గంటలకు విధులకు హాజరయ్యారు. కాగా, గతేడాది అక్టోబరులోనూ ఇదే తరహాలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్పుడూ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఫేక్‌గా తేల్చారు. ఈ తరహా బెదిరింపు మెయిల్స్ రెండేళ్లుగా తిరుపతిలోని పలు హోటళ్లు, ఆలయాలు, వ్యవసాయ వర్సిటీ, కలెక్టరేట్‌కు వచ్చాయి. ఇప్పుడు చిత్తూరులో మొదలైంది.