చిత్తూరు కోర్టును పేల్చేస్తాం
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:47 AM
చిత్తూరు కోర్టును సోమవారం ఉదయం 8.44 గంటలకు 25 సైనైడ్ బాంబులతో పేల్చేస్తామని ఆగంతకుల నుంచి ఆదివారం ఈమెయిల్ వచ్చింది. తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని అందులో పేర్కొన్నారు.
మరోసారి బాంబు బెదిరింపు మెయిల్
చిత్తూరు లీగల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు కోర్టును సోమవారం ఉదయం 8.44 గంటలకు 25 సైనైడ్ బాంబులతో పేల్చేస్తామని ఆగంతకుల నుంచి ఆదివారం ఈమెయిల్ వచ్చింది. తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని అందులో పేర్కొన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన ఈ మెయిల్‌ను కోర్టు సిబ్బంది సోమవారం ఉదయం 11 గంటలకు గమనించారు. ఈ విషయాన్ని జిల్లా న్యాయమూర్తి అరుణసారిక దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సహచర న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, సిబ్బందికి, జిల్లా పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అందరూ కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వచ్చేశారు. వేలిముద్ర నిపుణులు, డాగ్.. బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది, స్పెషల్ ఫోర్స్ పోలీసులు కోర్టు వద్దకు చేరుకొన్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి గదిని తనిఖీ చేశారు. చివరకు ఎటువంటి బాంబులు లేవని తేలడంతో మధ్యాహ్నం నుంచి కోర్టు కార్యకలాపాలు యథావిథిగా ప్రారంభమయ్యాయి. ఈ నెలలోనే 3వ తేదీన బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద మూడు పర్యాయాలు కోర్టును పేల్చేస్తామంటూ మెయిల్స్ వచ్చాయి. ఎవరు.. ఎందుకు మెయిల్ పెడుతున్నారనేది గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, తాజా ఈ-మెయిల్‌లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా గురించి సమాచారం ఇవ్వడం గమనార్హం.