మనకు రెండు కేంద్రీయ విద్యాలయాలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:29 AM
చిత్తూరు, కుప్పంలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు, కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ అడిషనల్ కమిషనర్ దీపేశ్ గెహ్లాట్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
రెండేళ్ల పాటు తాత్కాలిక భవనాల్లో నిర్వహణ
చిత్తూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, కుప్పంలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు, కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ అడిషనల్ కమిషనర్ దీపేశ్ గెహ్లాట్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. చిత్తూరులో ఓ కేంద్రీయ విద్యాలయ (కేవీ), విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. దీనిపై ఎన్నికల్లో హామీ ఇచ్చిన గురజాల జగన్మోహన్.. చిత్తూరు ఎమ్మెల్యే అయ్యాక కేవీ కోసం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. చిత్తూరుతో పాటు కుప్పంలోనూ కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చొరవ చూపారు. చిత్తూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మంగసముద్రంలో 8.08 ఎకరాలను (రూ.2.77 కోట్లు) కేటాయించింది. కుప్పానికి సంబంధించి బైరుగానిపల్లెలో స్థలాన్ని కేటాయించింది. ఏడాది కిందట ఢిల్లీ నుంచి కేంద్రీయ విద్యాలయ అధికారుల బృందం ఈ రెండు ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. తాజాగా ఈ రెండింటికీ అనుమతి లభించింది. ఈ రెండు చోట్లా 2026-27 విద్యాసంవత్సరం నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకోనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత 5 నుంచి 6కు, 6 నుంచి 7వ తరగతికి విద్యార్థులు అప్‌గ్రేడ్ అవుతారు.
తాత్కాలిక తరగతులు ఎక్కడంటే..
చిత్తూరులోని కేంద్రీయ విద్యాలయ (కేవీ)కు ఇరువారంలోని సిల్క్ ట్రైనింగ్ సెంటర్‌లో, కుప్పం కేవీకు సంబంధించి ద్రావిడ యూనివర్శిటీలో తాత్కాలికంగా తరగతుల్ని నిర్వహించనున్నారు. మూడేళ్లలో కేంద్రం టెండర్లు పిలిచి సొంత భవనాల్ని పూర్తి చేస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్ధారించారు.
నాడు వైసీపీ విఫలం
2022లో జరిగిన జిల్లాల విభజన తర్వాత చిత్తూరుకు ఒకటి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, మదనపల్లె ప్రాంతాలకు ఒక్కోటి చొప్పున మూడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. అన్నమయ్య జిల్లా పాలకులు, అధికారులు చొరవ తీసుకుని అనుకూల స్థలంతో పాటు మూడేళ్ల వరకు పనికొచ్చేలా తాత్కాలిక భవనాలను చూపారు. దీంతో అక్కడ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. చిత్తూరులో మాత్రం అలాంటి చొరవ చూపలేదు. బంగారుపాళ్యం మండలం మహాసముద్రంలో 5 ఎకరాల స్థలాన్ని చూపించినా, అది అనువైన స్థలం కాదని కేంద్రం తిరస్కరించింది.