మాకూ కావాలో అవకాశం
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:25 AM
చిత్తూరు మేయర్ అభ్యర్థిత్వానికి పోటీ పెరిగింది. ‘సర్’ ప్రక్రియ ముగిశాక ‘స్థానిక’ ఎన్నికలు ఉంటాయని, శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు.
చిత్తూరు మేయర్‌కు పెరిగిన పోటీ
ఎవరికి వారే మొదలు పెట్టిన ప్రయత్నాలు
అక్టోబరులో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం
చిత్తూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మేయర్ అభ్యర్థిత్వానికి పోటీ పెరిగింది. ‘సర్’ ప్రక్రియ ముగిశాక ‘స్థానిక’ ఎన్నికలు ఉంటాయని, శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు మొదటగా కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చిత్తూరు మేయర్ పీఠంపై నగరంలో చర్చ మొదలైంది. తమకూ అవకాశం కావాలని కోరే వారు.. ఎవరికివారుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మేయర్ అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చామంటూ ఇటీవల కొందరు పార్టీ మనుషులతో మాట్లాడి వెళ్లారు. ‘అధిష్ఠానం ఎవరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా స్వాగతిస్తా. నా తరపున ఫలానా వారికి ఇవ్వమని నేను అడగను’ అని పార్టీ ఉన్నత శ్రేణి నాయకులతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టంగా చెప్పేశారు.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలం కావాలని 2019 ఎన్నికల నుంచి ప్రయత్నిస్తున్నా కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో గురజాల గెలుపులో సీకే బాబు కీలకపాత్ర పోషించారు. ఇందులో భాగంగా మేయర్ పోస్టు తమ కుటుంబానికి కావాలని కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును, లోకేశ్‌ను కలిసి అభ్యర్థించినట్లు తెలిసింది.
మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కూడా తన కుమారుడి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉండటంతో మేయర్ పోస్టును బలిజలకు ఇవ్వమని కోరుతున్నారు. 2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఏఎ్‌సకు ఫోన్ చేసి ‘గురుజాల గెలుపు కోసం కష్టపడాలని, భవిష్యత్తులో అకాశాలు ఇస్తామ’ని హామీ ఇవ్వడంతో ఆయన ధైర్యంగా ఉన్నారు. మంత్రి నారాయణతో ఈయనకు సాన్నిహిత్యం ఉంది.
చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత ముందు నుంచీ మేయర్ పీఠం మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే మేయర్‌గా పనిచేసిన అనుభవం, బలిజ సామాజికవర్గం కావడం అనుకూలతలుగా చెబుతున్నారు. వీరి కుటుంబం మీద అధిష్ఠానానికి సానుభూతి ఉంది. ఈ క్రమంలో చుడా చైర్‌పర్సన్ పదవి ఇచ్చామని ఊరుకుంటారా? లేదా మరో అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి.
చుడా చైర్మన్ కోసం జిల్లాలోని ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లతో మాజీ కార్పొరేటర్ వసంత్ ప్రయత్నించినా, అవకాశం దక్కలేదు. దీంతో ఇప్పుడు మేయర్ పదవి తనకే కావాలని కోరుతున్నారు. ఈయనదీ ఎమ్మెల్యే సామాజిక వర్గం. అయితే 2014-19 మధ్యకాలంలో ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్లు కఠారి అనురాధ, హేమలత కూడా ఒకే సామాజికవర్గం వాళ్లేనని, ఇప్పుడూ ఉంటే తప్పేంటంటూ ఆయన వర్గీయులు అంటున్నారు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వెనుక ఉండడం ఈయనకు కలిసొచ్చే అంశం.
కరోనా సమయంలో నగరంలోని ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేయడం ద్వారా కాజూరు బాలాజీ వెలుగులోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో చిత్తూరు టికెట్ కోసం ప్రయత్నించిన ఆరుగురు ఆశావహుల్లో ఈయనా ఒకరు. ఈసారి కచ్చితంగా మేయర్ పోస్టు కావాల్సిందేనని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య కూడా జనసేన తరపున మేయర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. తొలుత చిత్తూరు టికెట్, తర్వాత తుడా, చుడా చైర్‌పర్సన్ పోస్టుల కోసం ఈమె ప్రయత్నించారు.
చుడాలో ఒకరి సర్దుబాటు
చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత పదవీకాలం ఈ ఏడాది నవంబరులో ముగియనుంది. ‘మేయర్’ అభ్యర్థిత్వం కోరుకునే వారిలో ఒకరిని ఈ పదవిలో నియమించే అవకాశాలున్నాయి.