Share News

నీళ్లు ఏటిపాలు

ABN , Publish Date - May 16 , 2026 | 01:31 AM

లైనింగ్‌కు నోచుకోని వెలిగల్లు ప్రాజెక్టు కాల్వలు నీరున్నా బీడుగా మారుతున్న భూములు

నీళ్లు ఏటిపాలు
నిండుకుండలా వెలిగల్లు ప్రాజెక్టు

గాలివీడు, మే 15 (ఆంధ్రజ్యోతి): రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండల కేంద్రానికి సమీపంలో పాపాఘ్ని నది మీద 2008లో రూ.2,008 కోట్లతో వెలుగల్లు ప్రాజెక్టు నిర్మించారు. 4.64 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ 10 కిలోమీటర్ల పరిధిలో 600 ఎకరాలు, మొత్తం కుడి, ఎడమ కాల్వలు, ఉపకాల్వల కింద 24వేల ఎకరాల అయకట్టు ఉంది. కొన్నేళ్లగా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతోంది. గత వైసీపీ ప్రభుత్వం కాల్వల మరమ్మతులను నిర్లక్ష్యం చేయడంతో నీళ్లు సక్రమంగా పారే పరిస్థితి లేకుండా పోయింది.

పూర్తికాని లైనింగ్‌ పనులు

గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న కుడికాల్వ కేవలం 58 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్‌ వేశారు. మిగతా కాల్వకు లైనింగు వేయకపోవడం వల్ల నీరంతా ఎక్కడికక్కడ వృథాగా కారిపోతోంది. పందికుంట, కొరల్రకుంట గ్రామాల పరిధి అటవీ ప్రాంతంలో వెళ్తున్న కాల్వ ఎక్కడ చూసినా రంధ్రాలు పడి నీళ్లన్నీ కారి ఏటిపాలవుతున్నాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో వెళ్తున్న కాల్వలకు కూడా లైనింగ్‌ లేకపోవడం వల్ల చాలా నీరు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్టులోని నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపడానికి విడుదల చేశారు. గాలివీడు మండలంలోని కుడి కాల్వ కింద ఉన్న చెరువులు పూర్తిగా నిండాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని ఆయకట్టు భూములకు నీరు చేరుకోలేదు. 25శాతం నీరు కూడా చివరి ఆయకట్టుకు చేరుకోలేదని రైతులు చెబుతున్నారు.

మరమ్మతులకు నోచుకోని పిల్ల కాల్వలు

వెలిగల్లు ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల కింద 140 కిలోమీటర్ల పిల్ల కాల్వలున్నాయి. ఈ కాల్వలు మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వీటి గుండా నీరు సక్రమంగా పారే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ప్రధాన కాల్వల ద్వారా కొంతమేర భూమి మాత్రమే సాగులోకి వస్తుందని, పిల్ల కాల్వల కింద అధిక మొత్తంలో సాగుభూమి ఉందన్నారు. కొన్ని కాల్వలు కూలిపోయాయని, మరికొన్ని దెబ్బతిన్నాయని వివరించారు. వీటిని బాగు చేస్తే అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. కుడి కాల్వకు లైనింగ్‌ వేయకపోవడం, కాల్వలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల భూములన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

లైనింగ్‌ను పూర్తి చేయాలి

వెలిగల్లు కుడి కాల్వకు లైనింగ్‌ లేకపోవడం వల్ల నీరు వృథా అవుతోంది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. పందికుంట, కొర్లకుంట గ్రామాల పరిఽధిలోని అటవీప్రాంతంలో నీరు ఎక్కువగా పోతోంది. అధికారులు దానిపై దృష్టి పెట్టాలి.

- మహేశ్వర్‌రెడ్డి, పందికుంట, గాలివీడు మండలం

Updated Date - May 16 , 2026 | 01:31 AM