కుప్పంలో జలకళ
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:38 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు భగీరథ ప్రయత్నం ఫలించి.. బిరబిరా పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణమ్మతో కుప్పానికి జలకళ ఉట్టిపడింది. చెరువు దొరువుల్లోనే కాదు, పంట కాలువల్లోనూ పారుతున్న నీటి దన్నుతో కరువు పారిపోయి.. బీడుపడ్డ పొలాలు సైతం పచ్చటి సిరులతో తులతూగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగి రైతాంగం వదనాలు కళకళలాడుతున్నాయి.
రైతాంగం వదనం కళకళ
కృష్ణమ్మ రాకతో పెరిగిన సాగు విస్తీర్ణం
బాబు భగీరథ ప్రయత్నంతో సర్వత్రా సుభిక్షం
కుప్పం, ఆంధ్రజ్యోతి
ముఖ్యమంత్రి చంద్రబాబు భగీరథ ప్రయత్నం ఫలించి.. బిరబిరా పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణమ్మతో కుప్పానికి జలకళ ఉట్టిపడింది. చెరువు దొరువుల్లోనే కాదు, పంట కాలువల్లోనూ పారుతున్న నీటి దన్నుతో కరువు పారిపోయి.. బీడుపడ్డ పొలాలు సైతం పచ్చటి సిరులతో తులతూగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగి రైతాంగం వదనాలు కళకళలాడుతున్నాయి.
వైసీపీ హయాంలో హంద్రీ-నీవా కాలువ జలాలు విడుదల పేరుతో సాగిన జగన్నాటకం కుప్పం రైతులను నిలువునా మోసపుచ్చింది. ఒకట్రెండు రోజులపాటు సాగిన నాటకంలో నిల్వవుంచి పారించిన నీటి తడి మరుసటి రోజుకే ఎండిపోయి అన్నదాతను వెక్కిరించింది. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే హంద్రీ-నీవా కాలువ పనులు చేపట్టి ఏకబిగిన పూర్తి చేసింది. చంద్రబాబు విరామమెరుగకుండా అపర భగీరథ ప్రయత్నంతో 738 కిలోమీటర్లనుంచి బిరబిరా పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణా జలాలు 19 నియోజకవర్గాలను తాకుతూ 18 రిజర్వాయర్లను నింపుతూ చివరకు కుప్పం చేరాయి. కుప్పం బ్రాంచి కాలువ అంతిమ స్థానమైన కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద 2025 ఆగస్టు 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి హంద్రీ-నీవా కాలువను జాతికి అంకితం చేశారు. ఇది కుప్పం చరిత్రలో ఒక మైలురాయి. నాటినుంచి నియోజకవర్గంలో రైతాంగ నామ నూతన శకం ఆరంభమైంది. ఒక్కో చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలలతో నేటికి నియోజకవర్గంలోని 125 చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. ఎండిపోయిన వ్యవసాయ బోర్లు రీఛార్జి అయ్యాయి. ఫలితంగా బీడుపడ్డ ఎకరాలకొద్దీ భూములు సాగులోకి వచ్చాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
‘ఆగస్టు 30న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి వెళ్లిన సీఎం చంద్రబాబు, 5 నెలల తర్వాత మళ్లీ కుప్పం వస్తున్నారు. జలకళతో, పచ్చని పంటలతో ఉత్సవంలా ఉన్న ఊళ్లు ఇప్పుడాయనకు మనసారా స్వాగతం పలకడానికి వేచి చూస్తున్నాయి. పెరిగిన జీవన ప్రమాణాలతో రైతాంగం సంతృప్త స్థితిలో ఆయప్పకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి కాచుకున్నారు.