Share News

వృథా చేస్తే తప్పదు ‘షాక్‌’

ABN , Publish Date - Jul 08 , 2026 | 01:16 AM

రీచార్జి చేస్తేనే విద్యుత్‌ సరఫరా మొదటగా ప్రభుత్వ సర్వీసులకు వర్తింపు

వృథా చేస్తే తప్పదు ‘షాక్‌’

చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఇష్టానుసారంగా లైట్లు, ఫ్యాన్లు ఏసీలు, ఫ్యాన్లు వేయరు. అవసరం మేర పొదుపుగా వాడుకుంటారు. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన విద్యుత్‌ బిల్లు చెల్లింపు ప్రక్రియతో ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు. వృథా వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ప్రక్రియ ఫోన్‌ రీచార్జి మాదిరిగానే ఉంటుంది. కాల పరిమితి దాటగానే అప్రమత్తం చేస్తుంది. ముందస్తు బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిచిపోతుంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ వినియోగం స్మార్ట్‌గా మారింది. వృథా వినియోగానికి చెక్‌ పెడుతుంది. అవసరాలకు తగ్గట్టుగానే ప్రభుత్వం ముందుగా బిల్లుకు నిధులు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు విద్యుత్‌ వినియోగానికి పోస్టు పెయిడ్‌ సేవలు అందుబాటులో ఉండేవి. ప్రతినెలా బిల్లులను చూశాక వినియోగదారులు చెల్లిస్తున్నారు. తాజాగా ప్రీపెయిడ్‌ సేవల విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ ఫోన్‌ మాదిరిగానే ముందుగా రీచార్జి చేసుకుంటేనే విద్యుత్‌ అందనుంది. జిల్లాలో 17,144 ప్రభుత్వ సర్వీసులు ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు 15,691 సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో తొలి విడతగా 3,503 సర్వీసులను ప్రీపెయిడ్‌ విధానంలోకి మార్చారు. ఈ సర్వీసులకు ప్రభుత్వం ముందుగానే విద్యుత్‌ శాఖకు రూ.1.35 కోట్లు చెల్లించింది. వృథాను తగ్గించడం, వినియోగంపై నియంత్రణ పెంచడం, బకాయిల సమస్యకు చెక్‌ పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.

రీచార్జి ఉంటేనే విద్యుత్‌

ప్రీపెయిడ్‌ విధానంలో విద్యుత్‌ వినియోగానికి ముందుగానే నిర్దిష్ణ మొత్తాన్ని జమ చేయాలి. ఆ మొత్తం మేరకే విద్యుత్‌ అందుతుంది. రీచార్జి అయిపోతే అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా ఫ్రెండ్లీ అవర్స్‌ గడువు ఇస్తారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాకలాపాలు నిలిచిపోకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తారు. కానీ మరుసటి రోజులోగా రీచార్జి చేయకుంటే విద్యుత్‌ సరఫరా జరగదు. అలాగే ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఉత్తర్వుల మేరకు మొండి బకాయిలను ఆర్థికశాఖ, పంచాయతీరాజ్‌ నుంచి నేరుగా డిస్కం సంస్థలకు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వృథాకు అడ్డుకట్ట

ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేకున్నా లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు నడుస్తుండటం వల్ల భారీగా విద్యుత్‌ వృథా అవుతోందని అభిప్రాయం ఉంది. ప్రీపెయిడ్‌ విధానం అమల్లోకి వస్తే ప్రతి యూనిట్‌ విలువ తెలిసి వినియోగం తగ్గుతుందని విద్యుత్‌ శాఖ ఉద్దేశం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం కూడా తగ్గుతుందని అంచనా . ప్రస్తుతం ఈ విధానం ప్రభుత్వ సర్వీసులతో ప్రారంభమైనప్పటికీ, భవిష్యత్తులో దశలవారీగా వాణిజ్య, విద్యుత్‌ కనెక్షన్లకు, అనంతరం గృహ వినియోగదారులకు కూడా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది.

వృథా కట్టడికే ఈ నిర్ణయం

జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని 15,691 సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేశాం. మొదటి విడతగా 3,503 సర్వీసులకు రూ.1.35 కోట్లు చెల్లించడంతో ప్రీపెయిడ్‌లోకి మార్పు చేశాం. మిగిలిన సర్వీసులకు చెల్లిస్తే వాటిని కూడా ప్రీపెయిడ్‌ కింద మారుస్తాం. విద్యుత్‌ వృథాను అరికట్టేందుకు ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.

- అమర్‌బాబు,విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

Updated Date - Jul 08 , 2026 | 01:16 AM