Share News

మామిడిపై యుద్ధమేఘాలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:12 AM

మామిడి రైతులకు ఈఏడాదీ కష్టాలు తప్పేలా లేవు. గతేడాది ఉత్పత్తి విస్తారంగా ఉన్నా గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వచ్చింది. అంతకుముందు సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులు దెబ్బతీశాయి. ఆశించిన స్థాయిలో పంట చేతికి అందలేదు. ఈఏడాది గల్ఫ్‌ యుద్ధం ప్రభావం చూపనుంది.

మామిడిపై యుద్ధమేఘాలు
మామిడిని ప్రొసెసింగ్‌ చేస్తున్న కార్మికులు

ఇప్పటికే ఫ్యాక్టరీల్లో పేరుకున్న సరకు

విదేశాల ఆర్డర్లు వస్తేనే కొనుగోళ్లకు ఆస్కారం

కలవరపడుతున్న మామిడి రైతులు

మామిడి రైతులకు ఈఏడాదీ కష్టాలు తప్పేలా లేవు. గతేడాది ఉత్పత్తి విస్తారంగా ఉన్నా గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వచ్చింది. అంతకుముందు సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులు దెబ్బతీశాయి. ఆశించిన స్థాయిలో పంట చేతికి అందలేదు. ఈఏడాది గల్ఫ్‌ యుద్ధం ప్రభావం చూపనుంది. ఇప్పటికే మామిడి గుజ్జు పరిశ్రమలపై ఈప్రభావం కనిపిస్తోంది. కంటైనర్‌ షిప్‌ నిర్వాహకులు తాత్కాలికంగా రవాణాను నిలిపివేశారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా ఎగుమతుల్లో కదిలికలేదు. దీంతో గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఫలితంగా మామిడి కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తమవున్నాయి.

-చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

జిల్లాలో ఏటా 1,48,314 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. తద్వారా 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 6.21 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఇందులో టేబుల్‌ వైరటీ రకాలు తక్కువ. గుజ్జు,తదితర ఉత్పత్తులకు మూలమైన తోతాపురిని అధికంగా సాగుచేస్తున్నారు. ఏటా సుమారు 2.25 లక్షల నుంచి 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు గుజ్జు తయావుతుంది. వీటిలో లక్ష మెట్రిక్‌ టన్నులు దేశీయంగానే అమ్ముడు పోగా మిగిలింది గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి కొనుగోలుకు ఎలాంటి ఆర్డర్లు రాలేదని ఇక్కడి పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఆర్డర్లు వస్తేనే రైతుల నుంచి మామిడి ఉత్పత్తుల కొనుగోలుకు ఆస్కారముంటుంది.

మూతపడిన పరిశ్రమలు

యుద్ధ ప్రభావంతో గల్ఫ్‌ దేశాల్లో చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. మరోపక్క పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఫ్యాక్టరీల్లో గుజ్జుకు అవసరమైన బాటిలింగ్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. మామిడి ఉత్పత్తుల కొనుగోలులో ఈబాటిలింగ్‌ తయారీ కీలకం. ఈఉత్పత్తి లేకుంటే ఎగుమతుల ఆర్డర్లు నిలిచిపోతాయి. సాధారణ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా నుంచి నెలకు 10 ట్రక్కుల గుజ్జు ఎగమతి అయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్లు రాక లక్షల టన్నుల వరకు గుజ్జు ఉత్పత్తులు ఫ్యాక్టరీల్లో నిలిచిపోయాయి.

మామిడి రైతాంగంపై ప్రభావం

గుజ్జు నిల్వలు ఎగుమతి కాకుంటే ఈఏడాది మామిడి కొనుగోలు చేసే పరిస్థితులు ఉండవనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు కూడా తాజా పరిస్థితులపై కలవరపడుతున్నాయి. ఫ్యాక్టరీల్లో దాదాపు రెండు వేల మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితో పాటు సీజన్‌ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికపై సుమారు 13 వేల మంది పనిచేస్తారు. 7.50 లక్షల టన్నుల మామిడిని ప్రొసెస్‌ చేస్తే 5.50 లక్షల టన్ను గుజ్జు చేతికి వస్తుంది. గల్ఫ్‌ పరిస్థితులను గమనిస్తే ఇక్కడి గుజ్జు నిల్వలు కదిలే పరిస్థితి లేదని ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో నష్టాలను చవిచూడాల్సి ఉందంటున్నారు.

గతేడాది బకాయిలు రాలేదు

గతేడాది రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కిలో మామిడికి రూ.12 గిట్టుబాటు ధర నిర్ధారించింది. ప్రభుత్వం తన వంతుగా కిలోకు రూ.4 చొప్పున కొనుగోలు చేసిన మామిడికి తగిన మొత్తాలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మిగిలిన రూ.8లు ఫ్యాక్టరీ యాజమాన్యాల నుంచి రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 40 శాతం కూడా రాలేదు. ఈనేపథ్యంలో గుజ్జు ఎగుమతి నిలిచిపోవడంతో తమ పంట ఉత్పత్తి కొనుగోలుపై రైతాంగం దిగులు చెందుతోంది.

జిల్లాలో మామిడి సాగు.. ఉత్పత్తుల వివరాలు

జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం : 1,48,314 ఎకరాలు

రైతులు : 62 వేలు

దిగుబడి అంచనా : 4.5 లక్షల నుంచి 6.25 లక్షల టన్నులు

గుజ్జు పరిశ్రమలు : 46

2024లో తయారైన పల్ఫ్‌ : 2.25 లక్షల టన్నులు

ఎగుమతైన గుజ్జు : 1.15 లక్షల టన్నలు

2025లో సిద్ధం చేసిన పల్ఫ్‌ : 2.50 లక్షల టన్నులు

దేశీయంగా విక్రయాలు : లక్ష మెట్రిక్‌ టన్నులు

నిలిచిపోయిన పల్ఫ్‌ ఎగుమతి : 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇంకా ఆర్డర్లు రాలేదు

యుద్ధం తాత్కాలికంగా ఆగినా గుజ్జు ఎగుమతులకు ఆర్డర్లు రాలేదు. గల్ఫ్‌ దేశాల్లోని ఫ్యాక్టరీలు మాకు ఈమేరకు సమాచారం అందించాయి. పెట్రోలియం ధరలు పెరగడంతో ఫ్యాక్టరీలు బాటిలింగ్‌ ప్రొడక్షన్‌ లేవంటున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీల్లో లక్ష మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఇవి అమ్ముడుపోయే వరకు నష్టాన్ని భరించాలి.

-రఘురాం చౌదరి, జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు

ఏదో రూపంలో నష్టం

ఏటా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. లక్ష టన్నుల వరకూ మామిడి ఉత్పత్తులు నిలిచి పోయాయంటున్నారు. దీని ప్రభావం ఈ సీజన్‌లో రైతులపై చూపుతుంది. ఏదో రకంగా రైతులకు నష్టాలు తప్పడంలేదు.

- ఉమాపతినాయుడు, జిలామామిడి రైతు సంఘం్ల ఉపాఽధ్యక్షుడు,

నెలల తరబడి తిరగాలి

బిల్లుల కోసం నెలల తరబడి రైతులు గుజ్జు ఫ్యాక్టరీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. గతేడాది కిలోకి రూ.12 ధర నిర్ణయించారు. ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.4 ఇచ్చింది. మిగిలిన రూ.8 ఇచ్చేందుకు ఫ్యాక్టరీలు విముఖత చూపడం లేదు. దీంతో బిల్లుల కోసం ఫ్యాక్టరీల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

-మునిరత్నంనాయుడు, మామిడి రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

గిట్టుబాటు చెల్లించాలి

ఎండలు తీవ్రంగా ఉండటంతో కాయలు అంతంత మాత్రమే వస్తున్నాయి. గతేడాదిలాగే గిట్టుబాటు ధర లభించదనే అనుమానం కలుగుతోంది. అష్టకష్టాలుపడి సాగు చేస్తేనే పంట చేతికి వస్తుంది. తద్వారా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. సాగు ఆపేస్తే, ఫ్యాక్టరీలు మూతపడాల్సిందే. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఇచ్చేలా చూడాలి.

-మురళి, మామిడి రైతుల సంఘం జిల్లా కార్యదర్శి

Updated Date - Apr 27 , 2026 | 01:12 AM