మార్కెట్లలో విరిసిన సంక్రాంతులు
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:12 AM
మదనపల్లె జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా మార్కెట్లలో పండుగ సామగ్రి కొనుగోళ్ల హడావిడి ప్రస్ఫుటమవుతోంది.
మదనపల్లె, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా మార్కెట్లలో పండుగ సామగ్రి కొనుగోళ్ల హడావిడి ప్రస్ఫుటమవుతోంది. చాలామంది ఇప్పటికే దుస్తులను కొనుగోలు చేశారు. పశువుల పండుగ కూడా కావడంతో కొందరు వ్యాపారులు వాటి అలంకరణ వస్తువులను విక్రయిస్తున్నారు. పిల్లల పతంగుల కోసం ప్రత్యేంగా దుకాణాలు వెలిశాయి. పండగ అవసరాల నేపథ్యంలో అభిరుచులకు అనుగుణంగా వస్తువులన్నీ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లు రద్దీగా కనిపించాయి. బెంగళూరు బస్టాండు, ఆర్‌ఆర్‌వీధి, నెహ్రుబజార్, చిత్తూరు బస్టాండు, తదితర ఏరియాల్లో పండుగ సామగ్రి దుకాణాల్లో సందడి కనిపించింది. పశువుల మూకతాడు నుంచి పైన వేసే పైజామ వరకూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజా సామగ్రిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. పశువుల అలంకరణ వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతుండగా వీటిలో కొన్నింటిపై జీఎస్టీ లేకపోవడం వల్ల ఽధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా ఏటికేడు పశువులు తగ్గిపోవడంతో అలంకరణ వస్తువులు పెద్దగా అమ్ముడుపోలేదు. మార్కెట్ తీరు పరిశీలిస్తే ఉత్సాహంగా పండుగ వాతావరణం వెల్లివిరిసింది.