Share News

ఇళ్ల లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:20 AM

గృహ లబ్ధిదారులకు బిల్లుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. గూడు సమకూరిందనే సంతోషం వారిలో కనిపించడంలేదు. కాలం గతించిపోతున్నా బిల్లులు మంజూరు కావడంలేదు. ఇల్లు నిర్మించాక వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఆ ఊసెత్తలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు వారంతా నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు

 ఇళ్ల లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ
లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేస్తున్న హౌసింగ్‌ అధికారులు (ఫైల్‌)

పట్టించుకోని గత వైసీపీ పాలకులు

2024లో పాత ఇళ్ల లబ్ధిదారలు గుర్తింపు

కూటమి ప్రభుత్వంపైనే కోటి ఆశలు

================

నియోజకవర్గం లబ్ధిదారులు పెండింగ్‌ బిల్లులు (రూ.కోట్లలో)

చిత్తూరు 1897 2.72

జీడీనెల్లూరు 5076 9.64

పలమనేరు 4338 5.44

పూతలపట్టు 4885 9.44

నగరి (3 మండలాలు) 2145 3.35

పుంగనూరు (2మండ..)1415 1.74

===============================

గృహ లబ్ధిదారులకు బిల్లుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. గూడు సమకూరిందనే సంతోషం వారిలో కనిపించడంలేదు. కాలం గతించిపోతున్నా బిల్లులు మంజూరు కావడంలేదు. ఇల్లు నిర్మించాక వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఆ ఊసెత్తలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు వారంతా నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నార.

-చిత్తూరు, ఆంధ్రజ్యోతి

జిల్లాలో 2014-19లో నాటి టీడీపీ ప్రభుత్వం పేదలకు ఆవాసం కల్పించాలని సంకల్పించింది. ఈక్రమంలోనే 2016లో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. అర్హులకు ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసింది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు దాదాపుగా దశల వారీగా బిల్లులు మంజూరు చేసింది. బిల్లుల చివరి దశలో 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ అడ్డంకి కావడంతో కొన్ని బిల్లులు నిలిచిపోయాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టీడీపీ హయాంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి బిల్లుల గురించి పట్టించుకోలేదు. . అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోయారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరందరిలో సంతోషం వెల్లివిరిసింది. బిల్లులు క్లియర్‌ అవుతాయని భావించారు. ప్రభుత్వం కూడా స్పందించి బిల్లులు పొందని లబ్ధిదారుల్ని గుర్తించేందుకు సర్వే చేయిందిది. 2024 అక్టోబరులో హౌసింగ్‌ అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు. ఈప్రక్రియను డిసెంబరులో పూర్తి చేశారు. వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

2024లో సర్వేలో గుర్తింపు

జిల్లాలో 29,093 మంది లబ్ధిదారులకు రూ.47.19 కోట్ల మేర మంజూరు చేయాలని అధికారులు గుర్తించారు. పునాది దశలో ఉన్న గృహాల్ని మాత్రం ఈ జాబితా నుంచి తొలగించారు. తాజా హౌసింగ్‌ పథకంలో చేర్చారు. కుప్పం నియోజకవర్గంలోని 3200 మంది లబ్ధిదారులకు రూ.9.57 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో 19,756 మందికి రూ.32.33 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అదే ఏడాది 2024 డిసెంబరులో ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి నుంచి బిల్లుల గురించి ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

కుప్పంలోని 3200 మందికి మంజూరు

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మాత్రం ఇళ్ల బిల్లులు క్లియరయ్యాయి. సాధారణంగా ఆయన తరచూ ఇక్కడ పర్యటిస్తుంటారు. దీంతో అధికారులు వివిధ రకాల బిల్లులను ప్రత్యేకంగా మంజూరు చేస్తుంటారు. పెండింగ్‌ నిధుల మంజూరు, పైలెట్‌ ప్రాజెక్టుల ప్రారంభం, పరిశ్రమలకు శంకుస్థాపన వంటి పనుల్ని చేపడుతుంటారు. ఈక్రమంలోనే ఆ నియోజకవర్గంలోని పాత లబ్ధిదారుల బిల్లులు మంజూరు చేశారు.

కచ్చితంగా బిల్లులు వస్తాయి

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా గతంలో మంజూరైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సర్వే చేసి గుర్తించాం. ప్రభుత్వానికి నివేదిక అందించాం. 19,756 మందికి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. త్వరలోనే బిల్లులు మంజూరవుతాయి.

- జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి

Updated Date - Jun 14 , 2026 | 01:20 AM