Share News

వినాయకా.. నిమజ్జనానికి నీళ్లెక్కడ?

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:26 AM

ఎల్‌నినో ప్రభావంతో.. వానాకాలంలోనూ ఎండలు మండుతున్నాయి. చెరువులు, వంకలు, వాగులు నీటి కళ తప్పాయి. చాలావరకు ఎండి, బీటలువారగా.. మరికొన్ని నీళ్లు అడుగంటాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికీ నీళ్లు లేని పరిస్థితి నెలకొంది.

వినాయకా.. నిమజ్జనానికి నీళ్లెక్కడ?
బీటలువారిన కట్టమంచి చెరువు

ఎల్‌నినో ప్రభావంతో.. వానాకాలంలోనూ ఎండలు మండుతున్నాయి. చెరువులు, వంకలు, వాగులు నీటి కళ తప్పాయి. చాలావరకు ఎండి, బీటలువారగా.. మరికొన్ని నీళ్లు అడుగంటాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికీ నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. సోమవారమే వినాయక చవితి. జిల్లాలో చవితి ఉత్సవాలను ఆర్భాటంగా నిర్వహించడం ఆనవాయితీ. నిమజ్జనాలకు నీళ్లు కరువైతే ఉత్సవాలు ఎలా నిర్వహించాలని మండపాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరులోని కొందరు సామూహిక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఇళ్లల్లో మట్టి వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేయాలని ప్రకృతి పర్యావరణ సరిరక్షణ సమితి, హిందూ చైతన్య వేదిక, కాళభైరవ ట్రస్టు, గురుకృప ట్రస్టు నిర్వాహకులు కోరుతున్నారు. అనంతరం ఇళ్ల వద్దే ఆ ప్రతిమలకు శాస్త్రోత్తంగా నిమజ్జనం నిర్వహించి ఆ నీటిని పూలమొక్కలకు పోయాలని కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది దాతలు రెండు నుంచి ఐదు ట్యాంకర్ల నీటిని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక, చిత్తూరు నగరంలోని కట్టమంచి, గంగినేని, కాజూరు, దుర్గానగర్‌ కాలనీ, గంగసాగరం, చెన్నమ్మగుడిపల్లె చెరువుల వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలకు కార్పొరేషన్‌ అధికారులు నీటి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. కట్టమంచి చెరువులో సరిపడా నీళ్లు లేనందున దాదాపు 50 ట్యాంకర్లతో నీటి చెలమ ఏర్పాటు చేసి నిమజ్జనం చేయనున్నట్లు డీఐ రోడ్డులో శివశక్తి వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు కణ్ణన్‌, దీపక్‌ తెలిపారు. ఇలా.. ఆయా సంఘాలు, నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నారు.

- చిత్తూరు కల్చరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 12 , 2026 | 01:26 AM