పుంగనూరు మున్సిపాలిటీ విజయం శ్రీకాకుళం సైకిల్ యాత్ర కార్యకర్తలకు అంకితం
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:08 AM
పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం సైకిల్‌యాత్ర చేస్తూ పుంగనూరులో అవమానానికి గురైన టీడీపీ కార్యకర్తలకు అంకితమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు.
పుంగనూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం సైకిల్‌యాత్ర చేస్తూ పుంగనూరులో అవమానానికి గురైన టీడీపీ కార్యకర్తలకు అంకితమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబును గత ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి, రాజమండ్రి జైలులో పెట్టడం బాధాకరమన్నారు. 2023 అక్టోబరు 2వ తేదీ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా వారువా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్రావు, రమేశ్ తమ సైకిళ్లకు టీడీపీ జెండాలు కట్టుకుని శ్రీకాకుళం నుంచి కుప్పానికి సైకిల్‌యాత్ర చేస్తూ పుంగనూరు మండలం సుగాలిమిట్టకు 20వ తేదీన వచ్చారన్నారు. ఆ సమయంలో పుంగనూరు నియోజకవర్గంలో పసుపు జెండాలు కనిపించరాదని వైసీపీ నాయకుడు చెంగళాపురం సూరి వారిపై దౌర్జన్యం చేసి బట్టలు విప్పించి, జెండాలు పీకి తొక్కి బండబూతులు తిట్టారన్నారు. అవమానంతో వెళ్లిన వారిని కూటమి ప్రభుత్వం రాగానే నాటి టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి పిలిపించి అవమానం జరిగిన చోటే వారిని సత్కరించినట్టు గుర్తు చేశారు. పుంగనూరులో అవమానం పొందిన శ్రీకాకుళం టీడీపీ కార్యకర్తలకే మున్సిపాలిటీ విజయం అంకితమని, ఇక జరిగే ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఇన్చార్జి మధుసూదన్‌నాయుడు ఆధ్వర్యంలో ఘన విజయాలు సాధించడం తథ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి మధుసూదన్‌నాయుడు పాల్గొన్నారు.