Share News

13వ స్నాతకోత్సవానికి వెటర్నరీ వర్సిటీ సిద్ధం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:48 AM

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఆధునిక పశువైద్య పద్ధతులతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న వర్శిటీ పశువైద్య విద్యాబోధన, పరిశోధన, విస్తరణ విభాగాల్లోనూ సత్ఫలితాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది.

13వ స్నాతకోత్సవానికి వెటర్నరీ వర్సిటీ సిద్ధం

తిరుపతి రూరల్‌,మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఆధునిక పశువైద్య పద్ధతులతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న వర్శిటీ పశువైద్య విద్యాబోధన, పరిశోధన, విస్తరణ విభాగాల్లోనూ సత్ఫలితాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. ఐవీఎఫ్‌ ప్రయోగశాలలో దేశవాళీ ఆవుదూడలను పిండోత్పత్తి విధానంలో పుట్టించడం, సమీకృత దాణా తయారీ కేంద్రం, పౌల్ర్టీ, సీమపందుల పెంపక కేంద్రం, విలువ ఆధారిత పశు ఉత్పత్తుల తయారీ విక్రయశాల, ఆహార పరీక్షా కేంద్రం, ఆధునిక జంతు వధశాలలను సాంకేతిక విధానంలో నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. స్నాతకోత్సవ సందర్భంగా 2023 ఏప్రిల్‌1 నుంచి 2024 ఆగస్టు 31 మధ్యకాలంలో వెటర్నరీసైన్స్‌(తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం), డెయిరీటెక్నాలజీ(తిరుపతి) కోర్సులు పూర్తిచేసిన 415మందికి కాన్వొకేషన్‌ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. అలాగే విద్యార్థులకు 35బంగారు పతకాలు, రెండు వెండి పతకాలు, ఒకరికి నగదు బహుమతి అందించనున్నారు. అలాగే బోధనా సిబ్బందికి ప్రతిభా ఉపాధ్యాయ, పరిశోధక శాస్త్రవేత, నీలకంఠాపురం శ్రీరామరెడ్డి, డాక్టర్‌ వి.పాండురంగారావు, ముప్పవరపు ఫౌండేషన్‌, డాక్టర్‌ ప్రతాప్‌ వి.రెడ్డి బంగారు పతకాలు, పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. చాన్సలర్‌ హోదాలో గవర్నరు అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర(నాగపూర్‌) యానిమల్‌ అండ్‌ ఫిషరీ సైన్సెస్‌ వర్సిటీ వీసీ నితిన్‌ వి.పాటిల్‌ పాల్గొననున్నారు. వెటర్నరీ సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించే స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇన్‌చార్జి వీసీ జేవీ రమణ తెలిపారు.

Updated Date - Mar 30 , 2026 | 12:49 AM