వేద వర్సిటీ రిజిస్ట్రార్ తొలగింపు
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:49 AM
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి.భాస్కరుడిని పదవి నుంచి తొలగిస్తూ వీసీ రాణిసదాశివమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
- తారకరామ కుమారశర్మకు తాత్కాలిక బాధ్యతల అప్పగింత
- ఉత్తర్వులు జారీ చేసిన వీసీ
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి.భాస్కరుడిని పదవి నుంచి తొలగిస్తూ వీసీ రాణిసదాశివమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక రిజిస్ట్రార్‌గా కృష్ణ యజుర్వేద విభాగ ప్రొఫెసర్ కె.తారకరామ కుమారశర్మకు బాధ్యతలు అప్పగించారు. దాంతో భాస్కరుడు తాను గతంలో పనిచేసిన ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి వెళ్లనున్నారు. రిజిస్ట్రార్‌గా భాస్కరుడి ప్రవర్తన, అధికార పరిమితులను అతిక్రమించడం, అనధికారిక లేఖా వ్యవహారాలు, వీసీ అధికారాలను పరిమితం చేసే చర్యలు, కీలక ఫైళ్లను పరిష్కరించకపోవడం వంటి అంశాల్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై టీటీడీ అధికారులకు మెయిల్ ద్వారా నివేదిక పంపాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, ఈ నెల 11వ తేదీకి రిజిస్ట్రార్‌గా భాస్కరుడికి ఏడాది పాలనా కాలం పూర్తికానుంది. అయితే.. వీసీ, రిజిస్ట్రార్ మధ్య విబేధాల కారణంగానే భాస్కరుడు పదవీ కాలాన్ని పొడిగించకుండా, తొలగించినట్టు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది.