గతేడాదికంటే వైభవంగా వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:27 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను గతేడాది కంటే వైభవంగా నిర్వహిస్తామని ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు చెప్పారు.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను గతేడాది కంటే వైభవంగా నిర్వహిస్తామని ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు చెప్పారు. అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరాలయ ప్రాంగణంలో ఆదివారం ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు శివశంకరి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి కోసం గతంలో భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఉభయదారులకు ఆలయంలో పని చేసే ఉద్యోగులు మర్యాద ఇవ్వాలన్నారు. వీటితో పాటు స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో ఆలయంలోని అన్ని గేట్ల తాళాలను అధికారులు తమ వద్ద ఉంచుకుని ఉభయదారులు విచ్చేసిన సమయంలో ఇవ్వడంలేదన్నారు. బ్రహ్మోత్సవాల పత్రికలలో మృతి చెందిన వారి పేర్లు ముద్రించడం సరికాదని చైర్మన్ సలహా ఇచ్చారు. దీనిపై ఉభయదారులు చర్చించుకుని తెలియజేస్తే నిర్ణయం తీసుకుంటామన్నారు. సేవా టికెట్లను కొన్నింటిని ఆఫ్‌లైన్‌లో ఉంచడానికి కృషి చేస్తామని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆలయంలో ఉభయదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఆలయ ఉభయదారులు అందరు కృషి చేయాలని కోరారు.
సెప్టెంబరు 14 నుంచి బ్రహ్మోత్సవాలు
వినాయక స్వామి బ్రహ్మోత్సవ పత్రికను ఉభయదారుల సమావేశంలో ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్ చదివారు. సెప్టెంబరు 14న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమై.. అక్టోబరు 4తో ముగియనున్నాయి. సెప్టెంబరు 14న వినాయక చవితి, 15న ఉదయం 7.15 గంటలకు స్వాతి నక్షత్రం కన్యాలగ్నంలో ధ్వజారోహణం, రాత్రి హంస వాహనం, 16న ఉదయం నెమలి, రాత్రి బంగారు నెమలి.. 17న మూషిక వాహన సేవ.. 18న బంగారు శేష, బంగారు పెద్ద శేష వాహనాలు.. 19న చిలుక, వృషభ.. 20న గజ వాహన సేవలు ఉంటాయి. 21వ తేదీన రథోత్సవం, 22న బిక్షాండి, రాత్రి తిరుకల్యాణం, అశ్వ వాహన సేవ, 23న సాయంత్రం ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, రాత్రి స్వామివారికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఫ అనంతరం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా 24న అధికారనంది వాహనం, 25న రావణబ్రహ్మ, 26న విమానోత్సవం, 27న సూర్యప్రభ, 28న చంద్రప్రభ, 29న యాళీ, 30న కల్పవృక్ష, అక్టోబరు 1న పూలంగి సేవ, 2న కామధేను వాహన సేవలు, 3న పుష్పపల్లకి, 4న తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.