సెటిల్‌మెంట్లకు అడ్డాగా వి.కోట
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:45 AM
వి.కోట సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారింది. అధికారులతో మాట్లాడి మీ పనులు చేయిస్తామంటూ అమాయకుల నుంచి పెద్దఎత్తున వసూళ్లు చేసిన ఘటనలు బయటపడుతున్నాయి. వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ హత్య కేసు విచారణ క్రమంలో శ్రీనివాసులు, దొరస్వామి దందా గురించి పోలీసులకు తెలిసింది. దీంతో వి.కోటలో సెటిల్‌మెంట్లపై పోలీసులు నిఘా పెట్టారు.
- రిపోర్టర్ జగన్ హత్య కేసుతో బయటపడుతున్న వైనం
- ఇప్పటికే శ్రీనివాసులు, దొరస్వామి అరెస్టు
- స్టేషన్‌కు వరుస కడుతున్న వారిద్దరి బాధితులు
- హత్య కేసు కాకుండా మరో నాలుగు కేసుల నమోదు
- వెలుగు చూడని ఘటనలన్నో?
చిత్తూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వి.కోట సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారింది. అధికారులతో మాట్లాడి మీ పనులు చేయిస్తామంటూ అమాయకుల నుంచి పెద్దఎత్తున వసూళ్లు చేసిన ఘటనలు బయటపడుతున్నాయి. వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ హత్య కేసు విచారణ క్రమంలో శ్రీనివాసులు, దొరస్వామి దందా గురించి పోలీసులకు తెలిసింది. దీంతో వి.కోటలో సెటిల్‌మెంట్లపై పోలీసులు నిఘా పెట్టారు.
శ్రీనివాసులు బీఎస్పీ నేత పేరుతో.. దొరస్వామి అంబేడ్కర్ యువసేనతో పాటు ఏదో మీడియా పేరుతో అమాయకుల్ని ఇబ్బంది పెట్టేవారు. వీరికి తోడు దొరస్వామి బామ్మర్ది సురేంద్ర, మరో వ్యక్తి గణపతి సెటిల్‌మెంట్లు చేసి, బెదిరించి వసూళ్లకు పాల్పడేవారు. గణపతి మీద గతంలో రౌడీ షీట్ ఉండేది. గతేడాది ఆరోగ్యం బాలేదని ఎస్పీతో అభ్యర్థించి రౌడీషీట్ ఎత్తేసుకున్నాడు. తాజాగా మళ్లీ తెరిచారు. జగన్ హత్య కేసులో శ్రీనివాసులు, దొరస్వామి పేర్లు బయటపడ్డాయి. వీరి మోసాలూ వెలుగు చూశాయి. వీరి బాధితులు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని వి.కోట పోలీసులు ప్రకటించారు. దీంతో వారిద్దరి వల్ల నష్టపోయిన వారంతా స్టేషన్‌కు వరుస కడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 10 మందికిపైగా డబ్బులిచ్చి మోసపోయామని పోలీసుల్ని ఆశ్రయించగా, ఆధారాలు పక్కాగా ఉన్న నలుగురి ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులు నమోదు చేశారు.
భార్యను ట్రాప్‌చేసి.. భర్త నుంచి రూ.3 లక్షల వసూలు
వి.కోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన భార్యకున్న వివాహేతర సంబంధంపై న్యాయం చేయమని శ్రీనివాసులు వద్దకు వచ్చారు. ఇతడేమో అతడి భార్యను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇద్దరికీ అది రెండో పెళ్లి. అంతటితో ఆగక, ఆ మహిళ భర్తను బ్లాక్‌మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేశాడు. బంగారాన్నీ బ్యాంకులో పెట్టి రూ.9 లక్షలకు రుణం తీసుకున్నాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాసులు, గణపతిపై కేసులు పెట్టారు.
భార్యాభర్తల గొడవలోకి దూరి.. రూ.75 వేలు లాగి..
రామకుప్పానికి చెందిన దీన్‌అహ్మద్, వి.కోటలో ఓ ఎస్సీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ వి.కోటలోనే నివాసం ఉంటారు. పెళ్లయిన 15 రోజులకే భార్యాభర్తలిద్దరూ గొడవపడి స్టేషన్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న దొరస్వామి, శ్రీనివాసులు వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా ‘మీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామ’ని బెదిరించారు. దీన్‌అహ్మద్ తండ్రి ఫోన్ లాక్కొని ఫోన్‌పే నుంచి రూ.75 వేలు బదిలీ చేయించుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పాసుబుక్కు కోసం రూ.3.50 లక్షలు తీసుకొని..
వి.కోట మండలం చిన్నశ్యామకు చెందిన కృష్ణప్ప, వెంకటేష్ మధ్య భూవివాదం ఉంది. కృష్ణప్పకు మద్దతుగా వెళ్లి నీ భూమికి పాస్ బుక్కులు తీయిస్తామంటూ నమ్మించి రూ.3.50 లక్షలు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గణపతి, శ్రీనివాసులు, దొరస్వామి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
భూమి మాదంటూ బెదిరించి రూ.2 లక్షలు వసూలు
వి.కోటలోని ఓ హోటల్ యజమాని హరికి 1.5 ఎకరాల భూమి ఉంది. రీసర్వేలో అందులో కొంత ప్రభుత్వానిది అని వచ్చింది. వెంటనే సెటిల్‌మెంట్ టీమ్ కల్పించుకుని అతడి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఫోన్‌పే ద్వారా బదిలీ చేసుకోవడంతో పోలీసులకు సాక్ష్యం లభించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు గణపతి, దొరస్వామి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రూ.3 లక్షలు వసూలు చేసి.. ముగ్గురు పంచుకుని..
వి.కోట మండలం పడిగలకుప్పంలో ఓ ముస్లిం మహిళకు హిందూ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయాన్ని తమీమ్‌కు చెప్పి దొరస్వామి రెచ్చగొట్టాడు దీన్ని తమీమ్, దొరస్వామి, శ్రీనివాసులు పంచాయితీ చేసి, ఆ హిందూ వ్యక్తి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. ముగ్గురూ పంచుకున్నారు.
దొరస్వామి రూ.1.40 లక్షలు తీసుకున్నాడు
మేం ఆరుగురు అన్నదమ్ములం. భూమి గొడవ కోర్టులో ఉంది. భూమిని రెడీ చేస్తామని, రిజిస్టర్ చేయిస్తామని దొరస్వామి చెప్పాడు. తహసీల్దార్, సీఐ, ఎస్‌ఐ, వీఆర్వో.. ఇలా అందరితో మాట్లాడి పరిష్కరిస్తానన్నాడు. అతడితో పాటు ఇంకొందరు కూడా ఉన్నారు. మాకు పేర్లు తెలియవు. దీంతో మా జీవనాధారమైన ఆవులమ్మేసి రూ.1.40 లక్షలు దొరస్వామికి ఇచ్చాం. రెండేళ్లవుతున్నా పరిష్కరించడం లేదు. డబ్బులివ్వడం లేదు.
- ఆనంద్ దంపతులు
సెటిల్‌మెంట్లు లేకుండా చేస్తున్నాం
వి.కోట ఇక సెటిల్‌మెంట్ అనే మాటే వినపడకుండా చేస్తున్నాం. ఇప్పటికే బాధితుల్ని తీవ్రంగా వేధించి, మోసం చేసిన నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు పంపించాం. వారి నుంచి మోసపోయిన బాధితులు పెద్దఎత్తున స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. సాక్ష్యాలున్న వాటికి కేసులు నమోదు చేస్తున్నాం. ఇంకా మోసపోయిన వాళ్లుంటే ఆధారాలతో పోలీసు స్టేషన్‌కు రండి.
- ప్రభాకర్, పలమనేరు డీఎస్పీ
- సోమశేఖర్‌రెడ్డి, వి.కోట సీఐ