Share News

‘ఉషా పరిణయం’కు పట్టాభిషేకం

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:00 AM

తిరుపతి మహతి కళా క్షేత్రంలో అభినయ ఆర్ట్స్‌ 26వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కళా వేడుకల ముగింపు సమావేశంలో ఆదివారం పద్య, సాంఘిక నాటక, నృత్య ప్రదర్శన కళాకారులకు హనుమ అవార్డులను ప్రదానం చేశారు.

‘ఉషా పరిణయం’కు పట్టాభిషేకం
ట్రోఫీ అందుకుంటున్న ఉషా పరిణయం పద్యనాటక బృందం

‘ఇది అతని సంతకం’కు ప్రథమ బహుమతి

నృత్యప్రదర్శనలో ‘నారసింహ కౌత్వం’ ఎంపిక

తిరుపతి(కల్చరల్‌), జూలై26 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మహతి కళా క్షేత్రంలో అభినయ ఆర్ట్స్‌ 26వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కళా వేడుకల ముగింపు సమావేశంలో ఆదివారం పద్య, సాంఘిక నాటక, నృత్య ప్రదర్శన కళాకారులకు హనుమ అవార్డులను ప్రదానం చేశారు. పద్యనాటకంలో విజయవాడకు చెందిన రామన్‌ ఫౌండేషన్‌ వారి సాయిబాబా నాట్య మండలి ప్రదర్శించిన ‘ఉషా పరిణయం’ ప్రథమ బహుమతి దక్కించుకుంది. ద్వితీయ బహుమతిని హైదరాబాద్‌కు చెందిన శ్యామలాంబ ఫైన్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రదర్శించిన ‘శ్రీ సూక్తం’, తృతీయ బహుమతిని కర్నూలుకు చెందిన టీజీవీ కళాక్షేత్రం ప్రదర్శించిన ‘సైరా నరసింహారెడ్డి’ సొంతం చేసుకున్నాయి. ప్రత్యేక బహుమతిని హైదరాబాద్‌లోని సంఘారెడ్డి జిల్లాకు చెందిన టీబీఆర్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ప్రదర్శించిన ‘త్యాగశీల దధీచి మహర్షి’ నాటకం అందుకుంది. సాంఘిక నాటకంలో గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్‌ ప్రదర్శించిన ‘ఇది అతని సంతకం’ ప్రథమ బహుమతిని అందుకోగా.. ద్వితీయ, తృతీయ బహుమతులను వెలగలేరుకు చెందిన వెలగలేరు ఆర్ట్స్‌ థియేటర్స్‌ ప్రదర్శించిన ‘నెట్‌’, విశాఖపట్నంకు చెందిన తెలుగు కళా సమితి వారు ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటకాలు సొంతం చేసుకున్నాయి. ప్రత్యేక బహుమతిని కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్‌ ప్రదర్శించిన ‘కన్నీటికి విలువెంత’ నాటకం అందుకుంది. నృత్య ప్రదర్శనలో ప్రథమ బహుమతిని తిరుపతికి చెందిన జతీస్‌ నృత్యాలయం ప్రదర్శించిన ‘నారసింహ కౌత్వం’ అందుకుంది. ద్వితీయ, తృతీయ బహుమతులను తిరుపతికే చెందిన శ్రీరాగ రసఝరి నృత్య నిలయం ప్రదర్శించిన ‘నాట్య గణపతి’, నాట్య రవళి డ్యాన్స్‌ అకాడమీ వారి ‘గణపతి’ నృత్యాలు సొంతం చేసుకున్నాయి. ప్రత్యేక బహుమతులను చిత్తూరుకు చెందిన శ్రీలక్ష్మి భరతనాట్య కళా క్షేత్రం వారి ‘మురళీధరన్‌ కౌత్వం’, విశాఖపట్నంకు చెందిన శివ దీక్షిత డ్యాన్స్‌ అకాడమీ వారి ‘వాసుదేవ’ నృత్యం, తిరుపతికి చెందిన నృత్యాంజలి డ్యాన్స్‌ అకాడమీ వారి ‘భాగ్యాధ లక్ష్మి’ నృత్య ప్రదర్శనలు ఎంపికయ్యాయి. బహుమతులతోపాటు పారితోషికాలను ఆయా సంస్థలకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు అందించారు.

ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో

అభినయ ఆర్ట్స్‌కు స్థానం

26 ఏళ్లుగా భారతీయ శాస్ర్తీయ నృత్య, పౌరాణిక నాటకాల ద్వారా యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు అభినయ ఆర్ట్స్‌ చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించారు. ఆ మేరకు ఆదివారం అభినయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్‌ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథ్‌రెడ్డి, అధ్యక్షుడు మబ్బు సూర్యనారాయణరెడ్డిలను ఈ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు సత్కరించి, ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ టి.రామకృష్ణారెడ్డి, రీజినల్‌ కోఆర్డినేటర్‌ శ్రీరామ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 02:00 AM