యూరియా.. ఏందయ్యా!
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:34 AM
ఇరాన్‌పై యుద్ధంతో యూరియా ధరలు పెరిగిపోతాయి. స్టాకే ఉండదు. - ఈ ప్రచారంతో రైతులు అవసరానికిమించి యూరియా కొని నిల్వ ఉంచుకున్నారు. కొందరు ప్రైవేటు డీలర్లూ బ్లాక్ చేయగా.. మరికొందరు అధిక ధరకు అమ్ముతున్నారు. వీటితో అవసరమైన రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
అవసరానికి మించి కొంటున్న రైతులు
అధిక ధరకు అమ్ముతున్న ప్రైవేటు డీలర్లు
బ్లాక్ చేసిన మరికొందరు
యుద్ధం ఎఫెక్ట్
ఇరాన్‌పై యుద్ధంతో యూరియా ధరలు పెరిగిపోతాయి. స్టాకే ఉండదు.
- ఈ ప్రచారంతో రైతులు అవసరానికిమించి యూరియా కొని నిల్వ ఉంచుకున్నారు. కొందరు ప్రైవేటు డీలర్లూ బ్లాక్ చేయగా.. మరికొందరు అధిక ధరకు అమ్ముతున్నారు. వీటితో అవసరమైన రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
- మదనపల్లె టౌన్, ఆంధ్రజ్యోతి
ఇప్పటికే యూరియా దొరకడంలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే.. ఇరాన్‌పై యుద్ధ ప్రభావంతో డిమాండు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూరియా తయారీకి ముడిసరుకైన సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) ఖతర్ నుంచి రావాలి. హోర్ముజ్ జలసంధి మూతతో ఓడల రవాణా నిలిచిపోయింది. దీంతో యూరియా ఉత్పత్తి తగ్గి.. ధరలు పెరగతాయని, స్టాకు ఉండకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ పంటలకు సరిపడా యూరియా దేశవ్యాప్తంగా నిల్వ ఉందని, కొరత రాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లా విషయానికొస్తే.. ప్రస్తుతం నడుస్తున్న రబీ సీజన్‌లో వరిపంట 7,402 హెక్టార్లు, మొక్కజొన్న(పశుగ్రాసం) 2,497 హెక్టార్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఉద్యానపంటలు 1213 హెక్టార్లలో సాగవుతున్నాయి. వీటికి 18,071 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 17,919 మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించారు. రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎ్‌సకే), సింగిల్‌విండో సొసైటీలు, మార్క్‌ఫెడ్ గోదాముల ద్వారా రైతులకు విక్రయించేశారు. ఇంకా ఈ నెలాఖరులోగా 2,614 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుంది. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే రెండు వారాలుగా వాల్మీకిపురం, గుర్రంకొండ, రామసముద్రం, నిమ్మనపల్లె, పీలేరు, ములకలచెరువు మండలాల్లో చాలా మంది రైతులు వారి అవసరానికి మించి యూరియా బస్తాలు కొని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. యుద్ధం కారణంగా యూరియా ధరలు పెరగడమో లేదా స్టాకే ఉండకపోవచ్చన్న ఉద్దేశంతో ఇలా కొని పెట్టుకుంటున్నారు. తీరా నిజంగా అసవరమున్న రైతులు ఆర్‌ఎ్‌సకేలు, ప్రైవేటు దుకాణాల వద్దకు వెళితే యూరియా లేదనే సమాచారం వస్తోంది. ఈ మండలాల్లో రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆర్‌ఎ్‌సకేలకు యూరియా వచ్చిందని తెలిసిన వెంటనే పెద్దఎత్తున రైతులు ఎగబడటంతో ఆయా కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంటోంది. డీడీఆర్‌సీ సమావేశంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రైతులకు కోటా విధిస్తేనే..
రైతులు సాగుచేసే పంటల వివరాలు ఈ-క్రా్‌పలో తప్పకుండా నమోదవుతాయి. ఆయా పంటలకు ఎంత యూరియా అవసరం ఉంటుందో అధికారులు లెక్క వేయాలి. ఈ అంచనాతో ఏ రైతుకు ఎంత యూరియా అవసరం ఉంటుందో కోటా విధించి సరఫరా చేయాలి. తద్వారా అవసరానికి మించి రైతులు యూరియా నిల్వ చేసుకోవడాన్ని అడ్డుకోవచ్చు. లేదంటో జిల్లాలో యూరియా సంక్షోభం నెలకొనే ప్రమాదం లేకపోలేదు.
బస్తా రూ.350కు అమ్మకం!
యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో యూరియా ఽధరలు 12 నుంచి 20శాతం పెరగొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీన్ని అసరాగా తీసుకుని కొందరు ప్రైవేటు డీలర్లు తమ వద్ద వున్న స్టాక్‌ను గోప్యంగా ఉంచేస్తున్నారు. మరికొందరు 45 కిలోల యూరియా బస్తాను ప్రభుత్వ రాయితీపోను రూ.266.50కు విక్రయించాల్సి ఉండగా.. రూ.320 నుంచి రూ.350 వరకు బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నారు. అయినా, రైతులు ఎక్కువ ధరకు కొంటున్నారు.
యూరియా దొరకడం లేదు
ఇప్పుడు అన్ని పంటలకు యూరియా వేస్తున్నాం. బయట అంగడిలో కూడా యూరియా దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. రైతుల అవసరాన్ని బట్టి ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలి.
- ఎన్.రాజశేఖర్‌రెడ్డి, రైతు, ఆరమడక, వాల్మీకిపురం మండలం
పశువుల మేతకూడా దొరకదు
యూరియా లేకుంటే పశువులకు మేతకూడా దొరకదు. చాలామంది గడ్డికోసం యూరియానే వాడతారు. వారం రోజుల్లో యూరియా దొరకదని అందరూ అంటున్నారు. అందుకే ఎక్కువ డబ్బులిచ్చి కొని, దాచుకుంటున్నాం. లేకుంటే పశువులను పస్తులు పెట్టాల్సిందే కదా.
- వెంకటరమణ, రైతు, ఆగ్రహారం, నిమ్మనపల్లె మండలం
లైసెన్సులు రద్దుచేసి.. కేసులు బుక్ చేస్తాం
జిల్లాలో యూరియాను బ్లాక్‌మార్కెటింగ్ చేసి ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయించే డీలర్ల లైసెన్సు రద్దు చేసి కేసులు బుక్ చేస్తాం. ప్రస్తుతం 5,874 టన్నుల యూరియా స్టాకుంది. రైతులు అవసరానికి మించి కొంటున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులతో అవగాహన కల్పిస్తున్నాం. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- శివన్నారాయణ, జిల్లా వ్యవసాయశాఖాధికారి, మదనపల్లె