Share News

ఆధ్యాత్మిక నగరిలో అలజడి

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:39 AM

పది రోజుల్లో మూడు కిరాతక హత్యలు పెళ్లి మండపం నుంచి వంటగది దాకా రక్తపు మరకలు నేరాల క్రూరత్వంపై పెరుగుతున్న ఆందోళన

ఆధ్యాత్మిక నగరిలో అలజడి

తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: వేలాదిమంది యాత్రికుల రాకపోకలతో.... గోవింద నామస్మరణతో నిత్యం మార్మోగే ఆధ్యాత్మిక నగరి తిరుపతి ఆందోళనకు గురవుతోంది. పది రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు కిరాతక హత్యలతో భయాందోళనకు లోనవుతోంది. ఘటనలు వేరు... కారణాలు వేరు... కానీ విషయం మాత్రం ఒకటే. ప్రాణం తీయడంలో ఏమాత్రం వెనుకాడని క్రూరత్వం...... జాలి, దయ, కరుణ మచ్చుకైనా కనిపించని వైనం చూసి దిగ్ర్భాంతి చెందుతోంది.

తిరుపతి జయానగర్‌లో మంగళవారం జరిగిన ఘటన నగరాన్ని దిగ్భారంతికి గురిచేసింది. 65 ఏళ్ల జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉన్నారని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. దోపిడీ కోసం వచ్చిన వారు కేవలం కొట్టి, భయపెట్టి నగలు తీసుకుని వెళ్లిపోలేదు. ఆమె గొంతు కోసి హత్య చేశారు. మెడలోని బంగారు గొలుసు, చెవిపోగులు తీసుకెళ్లారు. ఎందుకో వేలిని కూడా నరికి తీసుకెళ్లారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం పనిమనిషి వచ్చే వరకు ఈ దారుణం బయటపడలేదు. డబ్బు కోసం మనిషి ఎంత కిరాతకంగా మారగలడో ఈ ఘటన చూపించింది.

శుభకార్యంలో రక్తపాతం

ఈ నెల 8న లక్ష్మీపురం సర్కిల్‌ వద్ద వున్న పద్మావతి కళ్యాణ మండపాల ఆవరణలో పెళ్లి వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా కత్తులు మెరిశాయి. ప్రత్యర్థి వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి నరికి చంపేశారు. వందలాదిమంది చూస్తుండగానే జరిగిన ఆ జంట హత్యలు సంచలనం సృష్టించాయి. శుభకార్యాల మధ్యలో కూడా కక్షలు కత్తుల రూపంలో బయటపడటం సమాజాన్ని ఆశ్చర్యపరిచింది.

బైక్‌ ఇవ్వనన్నందుకే చంపేశారు

ఈ నెల 9న ఓటేరు ప్రాంతంలో మరో విషాదం... మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులు, పక్కనే ఉన్న మాలదాసరి శ్రీనివాసులు వద్ద బైక్‌ అడిగారు. వారికి ఎలాంటి పరిచయం లేకపోవడంతో ఆయన నిరాకరించారు. అంతే... ఆ ఒక్క మాట ఆయన ప్రాణం తీసింది. బీరు సీసాలతో దాడి చేసి, ఆపై సిమెంట్‌ ఇటుకలతో తలపై మోది చంపేశారు. పరిచయం లేదు... పాత కక్ష లేదు... చిన్న నిరాకరణకే ఒక ప్రాణం బలైంది.

మూడు హత్యలు... మూడు కారణాలు... ఒకే క్రూరత్వం

ఈ మూడు ఘటనలను విడివిడిగా చూస్తే అవి మూడు కేసులు మాత్రమే. కానీ కలిపి చూస్తే ఒక ఆందోళనకర చిత్రం కనిపిస్తోంది. ఒకటి దోపిడీ కోసం. మరొకటి పాత కక్షలతో. ఇంకొకటి క్షణికావేశంలో. కారణాలు వేరైనా, నిందితుల మనస్తత్వంలో మాత్రం ఒకే పోలిక కనిపిస్తోంది. చట్టం పట్ల భయం లేకపోవడం... ప్రాణం విలువను లెక్కచేయకపోవడం... హత్యను చివరి మార్గంగా కాకుండా తక్షణ పరిష్కారంగా భావించడం.

మారుతున్న నేరాల స్వరూపమా?

గతంలో కూడా గొడవలు జరిగేవి. దాడులు జరిగేవి. హత్యలూ జరిగేవి. కానీ ఇప్పుడు... చిన్న కారణాలకే ప్రాణాలు తీసే స్థాయికి నేరాల స్వరూపం మారుతోందా? దోపిడీ కోసం వృద్ధురాలినీ వదలకపోవడం... కక్ష కోసం పెళ్లి మండపాన్నీ పవిత్రంగా భావించకపోవడం... అపరిచితుడిని కూడా క్షణికావేశంలో హత్య చేయడం... ఇవన్నీ నేరాల క్రూరత్వం పెరుగుతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.గంజాయి, మద్యం, కక్షలు, దోపిడీలు కలిసి నేరాలకు కొత్త రూపం ఇస్తున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఎంత ముఖ్యమో, అలాంటి నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడం అంతకంటే ముఖ్యం. లక్షలాదిమంది భక్తులు నిత్యం అడుగుపెట్టే ఈ నగరంలో ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించడం ఇపుడు పోలీసు యంత్రాంగం ముందున్న అతిపెద్ద సవాలు.

Updated Date - Jul 15 , 2026 | 01:39 AM