లేని భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించి..
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:44 AM
గతంలో పాలసముద్రం మండలంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తహసీల్దార్లు మోహనవల్లి, వరలక్ష్మిపై చర్యలకు ఆదేశిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గతంలో పాలసముద్రం మండలంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తహసీల్దార్లు మోహనవల్లి, వరలక్ష్మిపై చర్యలకు ఆదేశిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్లు అక్కడ పనిచేసినప్పుడు రికార్డుల్లో లేని భూమిని సృష్టించి.. వెబ్‌ల్యాండ్‌లో అక్రమంగా నమోదు చేసినట్లు సీసీఎల్‌ఏ ఇచ్చిన నివేదిక మేరకు ఇద్దరిపై అభియోగాలు నమోదు చేస్తూ విచారణకు ఆదేశించింది.
పాలసముద్రం మండలం నరసింహాపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబరు 248లో మొత్తం 14 ఎకరాలున్నాయి. అందుకు అదనంగా వెబ్‌ల్యాండ్‌లో మరో 16 ఎకరాల వరకు చేర్చి ఐదుగురికి కట్టబెట్టినట్లు ప్రధాన అభియోగంగా ఉంది. ఈ సర్వే నంబరులో అన్ని రికార్డుల మేరకు కేవలం 14 ఎకరాలే నమోదై ఉంది. క్షేత్ర స్థాయిలోనూ ఇంతే భూమి ఉంది. అయితే, దీనికి కొత్త సబ్ నెంబర్లు కల్పించి.. రికార్డుల్లో, క్షేత్రస్థాయిలో లేని భూమిని అదనంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఈ అదనపు భూమిని 248/1 సర్వే నెంబరులో సి.రామరాజు, 248/1ఏ సర్వే నెంబరులో గంగాధరరాజుకు 4.4 ఎకరాల చొప్పు.. 248/1బిలో గోవర్ధనరాజుకు 4 ఎకరాలు.. 248/1ఎఫ్‌లో దామోదరరాజుకు, 248/1ఎఫ్1లో మేఘనాథరాజుకు 1.6 ఎకరాల చొప్పున వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఈ మేరకు వారికి పాసుపుస్తకాలు కూడా జారీ చేశారు. ఇందులో దామోదరరాజు, మేఘనాథరాజు ఈ వెబ్‌ల్యాండ్‌లోని భూములను తాకట్టు పెట్టి పాలసముద్రంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.75 వేలు, రూ.లక్ష వంతున రుణాలు కూడా పొందారని 2022లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ అక్రమాలపై అప్పట్లో నగరి ఆర్డీవో విచారణ జరిపారు. క్షేత్రస్థాయిలో భూమికి.. వెబ్‌ల్యాండ్‌లో భూమికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. వెబ్‌ల్యాండ్‌లో అదనంగా చేర్చిన భూముల సర్వే నెంబర్లకు సంబంధించి డీకేటీ పట్టాలు ఇవ్వలేదని, అసలు ఈ భూమి వారి ఎంజాయ్‌మెంట్‌లోనూ లేదని తేలింది.
ఆ ఇద్దరు తహసీల్దార్ల హయాంలో..
2014 జూన్ నుంచి 2016 జూన్ వరకు.. మళ్లీ 2017 నవంబరు నుంచి 2019 ఫిబ్రవరి వరకు మోహనవల్లి పాలసముద్రంలో తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో అసలు రికార్డుల్లో లేని 11.60 ఎకరాల్ని అదనంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. అదేవిధంగా వరలక్ష్మి 2011లో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు 4.40 ఎకరాల్ని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్లు విచారణలో తేలింది.
10 రోజుల్లో వివరణ ఇవ్వాలి
అక్రమాలకు పాల్పడ్ట తహసీల్దార్లు బాధ్యతారాహిత్యంతో తీవ్రమైన తప్పిదాలతోపాటు అవినీతికి కూడా పాల్పడిన కారణంగానే ఈ భూముల భాగోతం జరిగిందని విచారణ నివేదికలో తేల్చారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సి ఉన్నందున 10 రోజుల్లోగా సంజాయిషీ సమర్పించాలని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిపైనా పెన్షన్ రూల్స్ కింద శాఖపరమైన చర్యలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.