పంచాయతీల్లో ప్రచురితంకాని ఓటరు జాబితా
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:24 AM
గ్రామ పంచాయతీల్లో బుధవారం ఓటరు జాబితా ప్రచురణ కాలేదు. మ్యాపింగ్ సమస్య, ఇతర కారణాలతో ఈ పరిస్థితి తలెత్తింది.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో బుధవారం ఓటరు జాబితా ప్రచురణ కాలేదు. మ్యాపింగ్ సమస్య, ఇతర కారణాలతో ఈ పరిస్థితి తలెత్తింది. సర్వేలతో సతమతమౌతున్న పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశాలతో వందశాతం పన్నుల వసూళ్ళపై దృష్టిపెట్టారు. వందశాతం చేయని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పన్నుల వసూళ్లను సీరియ్‌సగా తీసుకున్నారు. దీనికి తోడు ఓటరు నమోదు, జాబితా ప్రచురణపై వారు దృష్టి పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఓటరు జాబితా ప్రచురణకు ఈనెల 9న గడువు విధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆ గడువును ఈ నెల 18 వరకు పొడిగించింది. అయుతే సాంకేతిక సమస్యల కారణంగా పంచాయతీ కార్యదర్శులు కుస్తీపడి 80శాతం మేర మ్యాపింగ్ ప్రక్రియను సిద్ధం చేస్తున్నారు. గ్రామపంచాయతీల మండలం, రెవిన్యూ డివిజన్, పేర్లు, జిల్లా కోడ్, వార్డులు, అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రం నెంబరు, పంచాయతీల్లో ఆవాస ప్రాంతాలు తదితర వివరాలను పరిగణలో తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మ్యాపింగ్ సమస్య కారణంగా ఓటరు జాబితా తయారీ బుధవారం నాటికి తయారుకాలేదు. తాజా సమాచారం మేరకు 60 గ్రామపంచాయతీల్లో మ్యాపింగ్ ప్రక్రియ క్లిష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మరో నాలుగు వారాలపాటు సమయమిస్తే తుది జాబితాను ప్రచురిస్తామని పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిసింది.