కరుణించని నైరుతి రుతు పవనాలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:18 AM
మృగశిర కార్తె వచ్చిందంటే పల్లెసీమల్లో రైతులు వేరుశనగ విత్తుతూ బిజీగా కనబడుతుంటారు. అలాంటిది ఈ కార్తె వచ్చి వారం గడచినా జిల్లాలో ఎక్కడా చేలల్లో రైతుల సందడే కనపడటం లేదు. కేరళం రాష్ట్రాన్ని దాటిన నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకి ఎనిమిది రోజులవుతున్నా ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో చినుకు కురవలేదు.
పంపిణీకి సిద్ధంగా విత్తనకాయలు
మృగశిర కార్తె వచ్చిందంటే పల్లెసీమల్లో రైతులు వేరుశనగ విత్తుతూ బిజీగా కనబడుతుంటారు. అలాంటిది ఈ కార్తె వచ్చి వారం గడచినా జిల్లాలో ఎక్కడా చేలల్లో రైతుల సందడే కనపడటం లేదు. కేరళం రాష్ట్రాన్ని దాటిన నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకి ఎనిమిది రోజులవుతున్నా ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో చినుకు కురవలేదు.
మదనపల్లె టౌన్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనంతో వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతు పవనాలు కేరళం రాష్ట్రాన్ని ఈ నెల 7వ తేదీన తాకాయి. అక్కడి నుంచి నాలుగు రోజులు పయనించి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలను ఈనెల 11వ తేదీన తాకాయి. దీంతో పలుచోట్ల మబ్బులు పట్టి చినుకులు పడుతూ వర్షాకాలం వస్తుందేమో అని ఆఽశలు పుట్టించాయి. కానీ వాతావరణ శాఖ అనుకున్న విధంగానే ఎల్నినో ప్రభావమో ఏమో కాని వర్షం వెనకడుగు వేసింది. జిల్లావ్యాప్తంగా కేవలం గత శుక్రవారం మాత్రమే వర్షం కురవగా ఐదు రోజులు ఒక్క చుక్క కూడా కురవలేదు. అసలు వాతావరణంలో వర్షం కురిసే ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు.
నాలుగు రోజులుగా నమోదైన వర్షపాతం
13వ తేదీ 22.2ఎం.ఎం
14వ తేదీ 13.0ఎం.ఎం
15, 16, 17 తేదీల్లో వర్షం లేదు
ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.5 ఎం.ఎం
ఇప్పటివరకు కురిసింది 44.5 ఎం.ఎం
రెండోసారి దుక్కులకు అదనపు ఖర్చులు
మృగశిర కార్తెలో వేరుశనగ విత్తితే మంచి దిగుబడి వస్తుందని రైతుల అభిప్రాయం. ఈనెల 8వ తేదీన రోహిణి కార్తె పోయి మృగశిర కార్తె వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షాలు కురిసి వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసుకుని రైతులు పొలాల్లో బిజీగా ఉంటారని కలలుగన్నారు. కానీ ఎల్నినో ప్రభావమో ఏమో కాని నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. వర్షాలు కురవక దుక్కులు ఎండిపోతుండటంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో వర్షం పడకుంటే మళ్లీ దుక్కులు దున్నాల్సి వస్తుంది.
సిద్ధంగా వేరుశనగ విత్తనాలు
జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. 25 మండలాలకు గాను ఈసారి ఖరీఫ్‌కు వేరుశనగ సాధారణ సాగు 27,016 హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందుకుగాను రైతులకు 36,480 క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను కేటాయించారు. ఇందులో కే-6 రకం 13,780 క్వింటాళ్లు, నారాయణి 13,280, టీసీజీఎస్ రకం 9,400 క్వింటాళ్లను సిద్ధం చేశారు. ఇప్పటికే పలు మండలాల్లో 30 శాతం దాకా విత్తనాలు రైతు సేవా కేంద్రాలకు చేరాయి. కొన్ని మండలాల్లో పంపిణీ కూడా మొదలుపెట్టారు. విత్తన కాయలను రైతులు ఒలిచిపెట్టుకుని విత్తేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.