తిరుపతి మేయర్‌పై కొనసాగుతున్న అస్పష్టత
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:03 AM
తిరుపతి మేయర్ పదవిపై కూటమి పార్టీల్లో అస్పష్టత కొనసాగుతూనే వుంది.ఈ పదవికి వున్న ప్రాధాన్యత దృష్ట్యా మూడు పార్టీలూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి.ఎమ్మెల్యేగా ఇప్పటికే జనసేన నుంచీ ప్రాతినిధ్యం వున్నందున ఆ పార్టీ నుంచీ డిమాండ్ గట్టిగా వినిపించే పరిస్థితి లేదు.ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైందవ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ పార్టీకి ఏదో ఒక కీలక పదవితో ప్రాతినిధ్యం వుండాలని బీజేపీ భావిస్తోంది.
తిరుపతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):తిరుపతి మేయర్ పదవిపై కూటమి పార్టీల్లో అస్పష్టత కొనసాగుతూనే వుంది.ఈ పదవికి వున్న ప్రాధాన్యత దృష్ట్యా మూడు పార్టీలూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి.ఎమ్మెల్యేగా ఇప్పటికే జనసేన నుంచీ ప్రాతినిధ్యం వున్నందున ఆ పార్టీ నుంచీ డిమాండ్ గట్టిగా వినిపించే పరిస్థితి లేదు.ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైందవ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ పార్టీకి ఏదో ఒక కీలక పదవితో ప్రాతినిధ్యం వుండాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆ పార్టీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి వ్యక్తిగత ఆసక్తి కూడా తోడు కావడంతో బీజేపీ నుంచీ గట్టిగా పట్టుబడుతోంది.జాతీయస్థాయిలో బీజేపీ నేతలతో సాన్నిహిత్యం కలిగి వున్నందున వారి ద్వారా టీడీపీ అధినేతపై భానుప్రకాష్‌రెడ్డి ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ పదవి జనరల్ కావడంతో తాను గానీ లేదా తన సతీమణి డాక్టర్ కత్తుల రేఖ గానీ పోటీ చేయాలని ఆయన ఆశిస్తున్నారు.రేఖ నగరంలో పేరుమోసిన డయాబెటిక్ స్పెషలిస్టు కావడంతో పాటు సామాజికవర్గపరంగా తిరుపతిలో ప్రాబల్యం వున్న బలిజ వర్గానికి చెందిన వారు. దీంతో రెండు సామాజికవర్గాల నుంచీ మద్దతు లభిస్తుందని భానుప్రకాష్‌రెడ్డి ప్రతిపాదిస్తున్నారు.టీడీపీ విషయానికొస్తే తిరుపతి నుంచీ ఆ పార్టీకి అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంటులోనూ ప్రాతినిధ్యం లేదు.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తిరుపతి టీడీపీ శ్రేణులు అధిష్ఠానం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న టీడీపీ ప్రాధమిక చర్చల్లో బీజేపీకి కేటాయించడానికి అంగీకరించలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు బీజేపీకి కేటాయించిన విషయాన్ని శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అంత కీలక సీటును బీజేపీకి కేటాయించినందున స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ సీటును కూడా మళ్ళీ ఎందుకు అదే పార్టీకి కేటాయించడమన్న ప్రశ్న ఆ వర్గాల నుంచి వినిపిస్తోంది. శ్రేణుల నుంచీ ఒత్తిడి వస్తుండడంతో టీడీపీ అధిష్ఠానం మేయర్ స్థానం కోసం పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. నేడు జరిగే చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చే అవకాశముండడంతో కూటమి పార్టీల శ్రేణులు, ఆశావహులు ఉత్కంఠగా వేచి చూస్తున్నాయి.