Share News

ఉజ్వల యోజనకు కత్తెర

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:31 AM

ప్రధానమంత్రి ఉజ్వలయోజన కింద పేదలకు పంపిణీ చేసే వంటగ్యాస్‌ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది.

ఉజ్వల యోజనకు కత్తెర

జిల్లాలో 20,212 కుటుంబాలపై ప్రభావం

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఉజ్వలయోజన కింద పేదలకు పంపిణీ చేసే వంటగ్యాస్‌ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది. ఈ పథకం కింద సిలిండర్‌కు రూ.300 వంతున సబ్సిడీని చెల్లించేది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ ఇచ్చేది. తాజాగా పథకంలో సబ్సిడీలో కోత విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో లబ్ధిదారులపై భారం పడింది. జిల్లాలో ఉజ్వల యోజన కింద 20,212 కనెక్షన్లు ఉన్నాయి. 2016 మేలో ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఇందుకు అర్హులుగా నిర్దేశించింది. డిపాజిట్‌ చెల్లించకుండానే సిలిండర్‌తో పాటు పొయ్యి, ట్యూబ్‌లను ఉచితంగా అందజేసింది తొలినాళ్లలో గ్యాస్‌ మొత్తాన్ని భరించినా 2022 నుంచి సిలిండర్‌పై రూ.200 రాయితీ మాత్రమే జమచేస్తూ వచ్చింది. 2023 అక్టోబరులో ఆ రాయితీని రూ.300కు పెంచింది. అయితే గతేడాది రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి 9కి తగ్గించారు. ప్రస్తుతం మరింత తగ్గించి నాలుగు సిలిండర్లకే పరిమితం చేసింది దీంతో ఏడాదికి రూ.1200 మాత్రమే ఉజ్వల లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుంది. గల్ఫ్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలుగా సాధారణ గృహ వినియోగదారుల సిలిండర్‌ ధరలను ప్రభుత్వం పెంచింది. మూడునెలల వ్యవధిలో సిలిండర్‌పై రూ.89 ధర పెంచింది. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ. 983.50కి చేరింది.

Updated Date - Jun 14 , 2026 | 01:31 AM