Share News

ప్రగతి పథంలో రెండేళ్లు

ABN , Publish Date - Jun 12 , 2026 | 02:01 AM

రైతులకు సాగునీరు.. ప్రజలకు తాగునీరు.. గ్రామాల్లో రహదారులు.. అంతర్రాష్ట్ర హైవేలు.. యువతకు ఉపాధి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.. అర్హులకు సంక్షేమ పథకాలు.. ప్రత్యేక విద్యాసంస్థలు, కొత్తగా ఆసుపత్రుల మంజూరు.. ఇలా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వ పాలన సాగింది. ఇలా అన్నిరకాలుగా రెండేళ్ల పాలనలో (జూన్‌12వ తేదికి రెండేళ్లు) ప్రభుత్వం ప్రత్యేక ముద్ర వేసింది.

ప్రగతి పథంలో రెండేళ్లు
గతంలో కుప్పంలో నర్వ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు

అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

పరిశ్రమల ఏర్పాటుకు పోత్సాహం

ప్రత్యేక ప్రణాళికతో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి

అన్నివర్గాలకు అనుకూలంగా కూటమి పాలన

చిత్తూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాగునీరు.. ప్రజలకు తాగునీరు.. గ్రామాల్లో రహదారులు.. అంతర్రాష్ట్ర హైవేలు.. యువతకు ఉపాధి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.. అర్హులకు సంక్షేమ పథకాలు.. ప్రత్యేక విద్యాసంస్థలు, కొత్తగా ఆసుపత్రుల మంజూరు.. ఇలా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వ పాలన సాగింది. ఇలా అన్నిరకాలుగా రెండేళ్ల పాలనలో (జూన్‌12వ తేదికి రెండేళ్లు) ప్రభుత్వం ప్రత్యేక ముద్ర వేసింది.

హంద్రీ నీవాతో మారిన జిల్లా రూపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీనీవా కాలువ పనుల్ని త్వరితగతిన పూర్తిచేసి గతేడాది కుప్పం కెనాల్‌లోని చివరి చెరువు పరమసముద్రం వరకు నీళ్లను తెచ్చారు. గతేడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు కుప్పంలో కృష్ణమ్మకు జలహారతినిచ్చారు. దీంతో జిల్లాలోని 110 చెరువులు నిండగా, 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. జిల్లాలో భూగర్భజలాలు బాగా పెరిగాయి. పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు రూ.319 కోట్లతో, కుప్పం కెనాల్‌కు రూ.197 కోట్లతో కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు పూర్తి చేశారు.

‘పారిశ్రామిక కుప్పం’ దిశగా..

సీఎం చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం మీద ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా ఇక్కడ పర్యటిస్తున్నారు. ప్రతిసారీ ఆయా పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక్కడ సుమారు రూ.వెయ్యి కోట్లతో ఒప్పందాలు కుదిరాయి. మండలానికో ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి భూమిని కేటాయించారు. కుప్పంలో నూతనంగా ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భూసేకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే అన్నిరకాల అనుమతులు వచ్చేశాయి. ఇక్కడ పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన డిజిటల్‌ నర్వ్‌ సెంటర్‌, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాల్ని డిజిటలైజ్‌ చేస్తున్నారు.

సబ్సిడీతో మామిడి రైతులకు అండ

గతేడాది తోతాపురి రకం మామిడి ధరలు పతనం కావడంతో కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మొత్తం రూ.187 కోట్ల సబ్సిడీని విడుదల చేయగా, అందులో జిల్లా వాటా రూ.147 కోట్లు. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

రెండు కేంద్రీయ విద్యాయాలతో పాటు..

జిల్లా కేంద్రం చిత్తూరుకు వైసీపీ హయాంలోనే కేంద్రం కేంద్రీయ విద్యాలయాను మంజూరు చేయగా, అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన స్థలాన్ని చూపకపోవడంతో రద్దయింది. కూటమి వచ్చాక చిత్తూరుతో పాటు కుప్పంలోనూ కేంద్రీయ విద్యాలయను మంజూరు చేయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆ రెండు చోట్ల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఎస్‌ఆర్‌పురంలో మహిళా డిగ్రీ కాలేజీ మంజూరు కావడంతో ఈసారి తరగతుల్ని ప్రారంభిస్తున్నారు.

ప్రారంభమైన ఓ హైవే.. సిద్ధంగా మరొకటి

చిత్తూరు- తచ్చూరు 6 లేన్‌ హైవే మీద ఇటీవల రాకపోకల్ని ప్రారంభించగా, చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరులోగా దీనిపై కూడా రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశముంది. 116 కిలోమీటర్ల చిత్తూరు- తచ్చూరు హైవే కోసం రూ.3998 కోట్లను ఖర్చు చేయగా, జిల్లాలో 85 కిలోమీటర్లు ప్రయాణించే చెన్నై- బెంగళూరు హైవే కోసం రూ.4925 కోట్లు ఖర్చు పెడుతున్నారు.

జిల్లా రహదారుల అభివృద్ధితో పాటు..

ఐదేళ్ల పాటు రహదారుల అభివృద్ధి, నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి వచ్చిన వెంటనే రూ.22 కోట్లతో గుంతల దారుల్ని మరమ్మతు చేసింది. పల్లెపండుగ కార్యక్రమం ద్వారా రూ.105 కోట్లతో 1500 సీసీ రోడ్లను నిర్మించారు. రూ.53 కోట్లతో 157 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లను.. రూ.40 కోట్లతో రూ.162 కి.మీల హైఇంపాక్ట్‌ రోడ్లును మరమ్మతులు చేశారు. కుప్పం నియోజకవర్గంలో మరో రూ.150 కోట్లతో రోడ్లను బాగు చేశారు. దీంతో పాటు చిత్తూరు నగరంలోని హైరోడ్డు విస్తరణకు రూ.37 కోట్లు ఇటీవల మంజూరయ్యాయి. దర్గా సర్కిల్‌ నుంచి ఇరువారం క్రాస్‌ వరకు రూ.14 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.2 కోట్లతో గాంధీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇక్కడ మరిన్ని రోడ్లు పురోగతిలో ఉన్నాయి.

నేతన్నలకు సర్కారు బాసట

ఉమ్మడి జిల్లాలోని 2864 మంది చేనేత, 3708 మంది మరమగ్గ కార్మికులకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఉచిత విద్యుత్తు పథకం అమవుతోంది. ఏప్రిల్‌ నెలలో జీరో కరెంటు బిల్లులు వచ్చాయి. వైసీపీ ఉచిత విద్యుత్తు హామీని ఐదేళ్ల పాటు పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గ కార్మికులకు 500 యూనిట్లు చొప్పున విద్యుత్తు అందిస్తున్నారు.

రూ.5256 కోట్లతో తాగునీటి పరిష్కారం

ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లోని తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు రెండు దశల్లో రూ.5256 కోట్లతో పనులు చేస్తున్నారు. తొలి దశలో రూ.2370 కోట్లతో పనులు జరుగుతుండగా, ఇవి పూర్తయితే రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె ప్రాంతాలకు తాగునీరు అందుతాయి. రూ.2886 కోట్లతో రెండో దశ పనులకు టెండర్లను పిలిచారు. ఇవి పూర్తయితే మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది.

పెద్దఎత్తున సంక్షేమ పథకాలు

ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి ఇస్తున్నారు. ప్రతి నెలా జిల్లాలో 2.32 లక్షల మందికి రూ.100.50 కోట్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తుండగా.. జిల్లాలో 1/3 వంతులో 3.53 లక్షల మందికి రూ.28.50 కోట్ల ప్రయోజనం కలుగుతోంది. ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని తీసుకురాగా, జిల్లాలో రోజుకు 40 వేల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ మీద రోజుకు రూ.12.60 లక్షల భారం పడుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా 2.60 లక్షల మందికి రూ.338 కోట్ల సాయం అందింది. అన్నదాత సుఖీభవ ద్వారా 2.05 లక్షల మందికి రూ.206 కోట్లు, పీఎం కిసాన్‌ ద్వారా 1.76 లోల మందికి రూ.69 కోట్లు మంజూరయ్యాయి.

ఫ ప్రతి నియోజకవర్గంలో ఓ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసి మూడు పూటలా కడుపు నింపుతున్నారు. కుప్పంలో అయితే అన్ని మండలాల్లోనూ ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు.

పీహెచ్‌సీల నిర్మాణం

పులిచెర్ల, ప్రశాంత్‌ నగర్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన పీహెచ్‌సీల నిర్మాణాల్ని పూర్తి చేశారు. మురకంబట్టు పీహెచ్‌సీ పనులు పురోగతిలో ఉన్నాయి. తవణంపల్లె, కుప్పం, కార్వేటినగరం మండలాల్లో ఒక్కోటి చొప్పున మూడు పీహెచ్‌సీలు మంజూరయ్యాయి. అలాగే జిల్లాకు కొత్తగా 13 విద్యుత్తు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి.

కుంకీలతో ఎంతవరకు ప్రయోజనం..?

మనుషులు, పంటలపై నిత్యం దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగుల్ని కట్టడి చేసేందుకు గతేడాది మే నెలలో కర్ణాటక నుంచి జిల్లాకు నాలుగు కుంకీ ఏనుగుల్ని తెచ్చారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కృషి చేయగా, ఆ ఏనుగుల్ని పలమనేరులో 50 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఎలిఫెంట్‌ క్యాంపులో ఉంచారు. మదపుటేనుగుల్ని ఈ కుంకీ ఏనుగులు అదుపు చేస్తాయని చెప్పినా.. ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు.

Updated Date - Jun 12 , 2026 | 02:01 AM