ఒకే పోస్టులో ఇద్దరు
ABN , Publish Date - May 14 , 2026 | 12:10 AM
పుంగనూరు మున్సిపల్ కార్యాలయానికి ప్రభుత్వం మంజూరు చేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఒక్కటే ఉండగా విచిత్రంగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉన్నప్పటికీ ఆయనను నామమాత్రంగా కుర్చీకి పరిమితం చేసి గతంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్ పెత్తనం చలాయిస్తున్నాడు.
రెగ్యులర్ ఎస్‌ఐ ఉన్నా పెత్తనమంతా జూనియర్ అసిస్టెంట్‌దే
పుంగనూరు, మే 13(ఆంధ్రజ్యోతి): పుంగనూరు మున్సిపల్ కార్యాలయానికి ప్రభుత్వం మంజూరు చేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఒక్కటే ఉండగా విచిత్రంగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉన్నప్పటికీ ఆయనను నామమాత్రంగా కుర్చీకి పరిమితం చేసి గతంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్ పెత్తనం చలాయిస్తున్నాడు. గతంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా వెంకటసుబ్బయ్య పనిచేస్తూ మదనపల్లె మున్సిపాలిటీకి బదిలీ కాగా ఆ స్థానంలో రాయచోటి మున్సిపాలిటీ నుంచి నవరత్న వచ్చారు. ఈ ఏడాది జనవరి 20న ఆయనను రెగ్యులర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా పుంగనూరులో చేరారు. కానీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉండాల్సిన కుర్చీకానీ, బాధ్యతలు గానీ మున్సిపల్ కమిషనర్ ఇవ్వలేదు. ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తే కొనసాగుతారని అధికారులు ఆదేశించడంతో రెగ్యులర్ ఎస్‌ఐ కార్యాలయంలో ఆయన టేబుల్ పక్కనే మరో కుర్చీ వేసి కూర్చోమన్నారు. రోజూ శానిటరీ మస్టర్‌కు రావడం, వెళ్లడం జరుగుతోంది. కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మునివెంకటప్ప మాత్రం ఆఫీసులోని ఎస్‌ఐ కుర్చీ, టేబుల్ వాడుకుంటూ రికార్డులు రాయడం, వేతనాలు బిల్లులు, ఇతర అన్ని పనులు ఆయనే చేస్తూ పవర్ చెలాయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.