Share News

ఇద్దరు సీఐల సస్పెన్షన్‌

ABN , Publish Date - May 22 , 2026 | 01:42 AM

విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, కేసుల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు సీఐలపై సస్పెన్షన్‌ వేటు పడింది. గతంలో తిరుపతిలో పనిచేసి ప్రస్తుతం అనంతపురం వీఆర్‌లో ఉన్న సీఐలు శ్రీనివాసులు, రామయ్యలను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ షిముషి బాజ్‌పేయ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇద్దరు సీఐల సస్పెన్షన్‌

పోక్సో కేసులో నిర్లక్ష్యం... సైబర్‌ నగదు దుర్వినియోగ ఆరోపణలు

తిరుపతిలో పనిచేసిన శ్రీనివాసులు, రామయ్యలపై డీఐజీ వేటు

తిరుపతి(నేరవిభాగం), మే 21(ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, కేసుల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు సీఐలపై సస్పెన్షన్‌ వేటు పడింది. గతంలో తిరుపతిలో పనిచేసి ప్రస్తుతం అనంతపురం వీఆర్‌లో ఉన్న సీఐలు శ్రీనివాసులు, రామయ్యలను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ షిముషి బాజ్‌పేయ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా డీఐజీ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. తిరుపతి ఈస్ట్‌ పోలీ్‌సస్టేషన్‌లో సీఐగా పనిచేసిన శ్రీనివాసులు ఇటీవల నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడిని సరైన రీతిలో విచారించకుండా వదిలేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో పాటు పలు కేసుల్లో సెటిల్మెంట్లకు పాల్పడినట్లు అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం. అలాగే హనీ మెస్‌ వద్ద జరిగిన హత్య కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఎస్వీ యూనివర్సిటీ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసిన సీఐ రామయ్య పలువురి నుంచి డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించనట్టు అధికారులకు ఫిర్యాదులందాయి. ఓ సైబర్‌ నేరం కేసులో రికవరీ చేసిన రూ. 6 లక్షల నగదును బాధితులకు అప్పగించకుండా సొంతవసరాలకు వినియోగించుకున్నట్టు విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిసింది.ఇద్దరు అధికారుల వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారిని సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - May 22 , 2026 | 01:42 AM