వీఆర్‌ఏపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:29 AM
వీఆర్‌ఏపై దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వివరాలను రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్ ఆదివారం మీడియాకు తెలిపారు.
రైల్వేకోడూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): వీఆర్‌ఏపై దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వివరాలను రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్ ఆదివారం మీడియాకు తెలిపారు. రైల్వేకోడూరు మండలంలోని ఓబనపల్లె వీఆర్‌ఏ కనుపర్తి మణెయ్య తన విధులను ముగించుకుని బైక్‌పై ఈనెల 4వతేదీ రాత్రి ఏడు గంటల సమయంలో చిట్వేలి రూటులో ఓవర్‌బ్రిడ్జి వద్ద వస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని కంట్లో కారంపొడిచల్లి కత్తి, ఇనుపరాడ్డుతో దాడిచేసి.. హత్యచేయడానికి ప్రయత్నించారు. ఎస్పీ సుబ్బరాయుడు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఈ కేసును ఛేదించడానికి ముగ్గురు పోలీసులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు సాంకేతికతను ఉపయోగించి సీసీ కెమెరాల సాయంతో నిందితులుగా ఓబనపల్లెకు చెందిన ఈనరాతి శ్రీనివాసులు, ఈనరాతి కులశేఖర్‌లను గుర్తించారు. వీరిని అనంతరాజుపేట సాయిబాబా ఆలయం సమీపంలో అరెస్టు చేశారు. నిందితుల వాడిన ఇనుపరాడ్డు, మచ్చుకత్తి, సెల్‌ఫోన్, కారంపొడి, బైక్ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన హెడ్‌కానిస్టేబుళ్లు రాజేంద్రస్వామి, సుధాకర్‌రాజు, సాంకేతిక నిపుణులు నరసింహ, పుష్పరాజ్‌లకు రివార్డులను సీఐ అందజేశారు.