తుడా పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:48 AM
2మున్సిపాలిటీలు, 8 మండలాల తొలగింపు 193 గ్రామాలు అవుట్... 102 గ్రామాలు ఇన్ రైల్వే కోడూరు సెగ్మెంట్ మొత్తం విలీనం 6 మున్సిపాలిటీలు, 36 మండలాలు, 1080 రెవిన్యూ గ్రామాలతో తుది రూపు 8352.43 చ.కిమీ నుంచీ 7728.63 చ.కిమీలకు తగ్గిన విస్తీర్ణం
తిరుపతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను రాష్ట్రప్రభుత్వం పునర్వవస్థీకరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాల పునర్విభజన జరిగిన నేపధ్యంలో పాలనా సౌలభ్యం కోసం తుడా పరిధిని మారుస్తూ సోమవారం అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల పునర్విభజన కారణంగా గూడూరు మున్సిపాలిటీ సహా గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు నెల్లూరు జిల్లాలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో వీటిని తుడా పరిధి నుంచీ మినహాయించి నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చారు. అలాగే నగరి మున్సిపాలిటీతో పాటు నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలు చిత్తూరు జిల్లా పరిధిలో వున్నందున వాటిని కూడా తుడా నుంచీ మినహాయించి చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చారు.అన్నమయ్య జిల్లా నుంచీ తిరుపతి జిల్లాలో చేరిన రైల్వేకోడూరు నియోజకవర్గం పూర్తిగా ఇపుడు తుడాలో విలీనమైంది. రైల్వే కోడూరు, పెనగలూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి మండలాలు తుడా పరిధిలోకి వచ్చాయి.
847 నుంచీ 7728 చ.కిమీలకు పెరిగిన తుడా పరిధి
1981 నవంబరు 6న తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, రేణిగుంట, చంద్రగిరి మండలాల పరిధిలోని 89 గ్రామాలను కలిపి ప్రభుత్వం తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా ప్రకటించింది.అప్పట్లో తుడా పరిధి కేవలం 847.95 చదరపు కిలోమీటర్లు.2008, 2019, 2020, 2021, 2022 లో తుడా పరిధిని మార్పుచేర్పులకు గురి చేసింది. గతేడాది డిసెంబరు 31న ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. అందులో భాగంగా పలు మండలాలను ఒక రెవిన్యూ డివిజన్ నుంచీ మరో డివిజన్‌కు, ఒక జిల్లా నుంచీ మరో జిల్లాకు మార్చింది. దానికనుగుణంగా ప్రభుత్వం తాజాగా కసరత్తు చేసి పట్టణాభివృద్ధి సంస్థల పరిధులను కూడా మార్చింది. ఆ మేరకు తుడా సైతం రెండు మున్సిపాలిటీలను, ఎనిమిది మండలాలను కోల్పోయి, కొత్తగా ఐదు మండలాలను తనలో విలీనం చేసుకుంది. ప్రభుత్వం సోమవారం జారీ చేసిన అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలు, జిల్లాలోని మొత్తం 36 మండలాలు, వాటి పరిధిలోని 1080 రెవిన్యూ గ్రామాలను కలిగివుంది. ఇక పరిధి విషయానికి వస్తే 7728.63 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.