Share News

రూ.788.15 కోట్లతో తుడా బడ్జెట్‌ ఆమోదం

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:41 AM

తిరుపతి పట్ణణాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన జరిగింది. రూ.788.15 కోట్లతో తుడా బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో తుడా ఆదాయం సుమారుగా రూ.590 కోట్లు వుండగా, రూ.198 కోట్లు లోటు బడ్జెట్‌ వున్నట్లు అధికారులు గణాంకాలు చూపారు.

రూ.788.15 కోట్లతో తుడా బడ్జెట్‌ ఆమోదం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, చైర్మన్‌ దివాకర రెడ్డి

తిరుపతి సెంట్రల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్ణణాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన జరిగింది. రూ.788.15 కోట్లతో తుడా బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో తుడా ఆదాయం సుమారుగా రూ.590 కోట్లు వుండగా, రూ.198 కోట్లు లోటు బడ్జెట్‌ వున్నట్లు అధికారులు గణాంకాలు చూపారు. భూమి మోనిటరైజేషన్‌ ద్వారా ఈ లోటును పూడ్చుకోవడానికి దాదాపు 320 ఎకరాలను అధికారులు గుర్తించారు. వీటిని అభివృద్ధి చేసి లే అవుట్లు వేసి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో లోటు బడ్జెట్‌ను పూడ్చుకోవడానికి తుడా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా

2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు సమావేశంలో పాలకమండలి ఆమోదం తెలిపిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి పచ్చజెండా ఊపారు. ప్రధానంగా పట్టణ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను వినియోగించుకోవాలనే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.

శెట్టిపల్లి టౌన్‌ షిప్‌ అభివృద్ధి

శెట్టిపల్లి ప్రాంతాన్ని ఆధునిక నివాస సముదాయంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వసతి పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. అవిలాల చెరువు ట్యాంక్‌ బండ్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు తిరుపతిలో రహదారుల విస్తరణ, పారిశుధ్యం, పార్కులు అభివృద్ధి, పచ్చదనం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి నిధులు వెచ్చించనున్నారు.

పనుల్లో నాణ్యత వుండాలన్న కలెక్టర్‌

బడ్జెట్‌కు ఆమోదం అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ తుడా ద్వారా చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచే విధంగా ఉండాలన్నారు. ఆమోదం పొందిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు. తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారదర్శకత, బాధ్యత కీలకమన్నారు. వైస్‌ చైర్మన్‌ గోవిందరావు మాట్లాడుతూ అన్ని అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో టైనీ కలెక్టర్‌ సందీప్‌ రఘువాన్సీ, ఆర్డీవో రామ్మోహన్‌రావు, జిల్లా రిజిస్ర్టార్‌ శ్రీరామ్‌, తుడా సెక్రటరీ శ్రీకాంత్‌ బాబు, ఎస్‌ఈ రవీంద్రయ్య, చీప్‌ ప్లానింగ్‌ అధికారి దేవికుమారి, తుడా భూసేకరణ అధికారి సుజన, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 01:41 AM