Share News

త్రిశంకు నగరి

ABN , Publish Date - Jan 24 , 2026 | 02:07 AM

చిత్తూరు జిల్లాకు దూరంగా.. తిరుపతికి దగ్గరగా ఉన్న ఆ మూడు మండలాల విలీనం హామీ నెరవేరలేదు. దీనిపై నగరి నియోజకవర్గంలోని ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడుకు సరిహద్దున ఉండటంతో పారిశ్రామికంగా అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి.

త్రిశంకు నగరి

జిల్లాల పునర్విభజనలో అయోమయం

చేనేతకు దక్కని చేయూత

చెరకు రైతుకు చేదే

పట్టించుకుంటేనే ప్రగతి పథం

చిత్తూరు జిల్లాకు దూరంగా.. తిరుపతికి దగ్గరగా ఉన్న ఆ మూడు మండలాల విలీనం హామీ నెరవేరలేదు. దీనిపై నగరి నియోజకవర్గంలోని ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడుకు సరిహద్దున ఉండటంతో పారిశ్రామికంగా అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. దీనికోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. హామీలనూ నెరవేర్చాలి. తద్వారా నగరి నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టించేలా సీఎం చంద్రబాబు చొరవ చూపాల్సి ఉంది.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

విలీనం మాట ఏమైంది?

చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని ఎన్నికల సమయంలో నగరి టవర్‌క్లాక్‌ వద్ద చంద్రబాబు.. యువగళం పాదయాత్ర సందర్భంగా పుత్తూరులో నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ కూడా పలుమార్లు సీఎంను కలిసి మూడు మండలాల గురించి చర్చించారు. ఇటీవల జరిగిన జిల్లాల విభజన సమయంలోనూ ఆ మూడు మండలాలను తిరుపతిలో కలపాలని క్యాబినేట్‌ సబ్‌ కమిటీతో పాటు చిత్తూరు కలెక్టర్‌ కూడా ప్రతిపాదించారు. చివరి క్షణంలో ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. దీంతో ఆ మూడు మండలాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

‘కోసలనగరం’పై మరింత చొరవ అవసరం

విజయపురం మండలం కోసలనగరంలో పారిశ్రామికవాడ అభివృద్ధికి ముందడుగు పడింది. 2014-19 మధ్యకాలంలో ఇక్కడ 2 వేల ఎకరాల్ని గుర్తించారు. పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామంటూ వైసీపీ ఐదేళ్ల పాటు కాలం వెల్లదీసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ పలుమార్లు సీఎంను కలిసి పారిశ్రామిక వాడ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే 1500 ఎకరాల్ని సేకరించి, తొలి విడతలో 750 ఎకరాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల కిందట కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కోసలనగరంలో గ్రామసభ నిర్వహించి, ఎకరాకు రూ.14 లక్షల పరిహారాన్ని నిర్ణయించారు. తమిళనాడుకు ఆనుకుని.. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ సమీపంలో ఉండడం, హైవేలు, విమానాశ్రయాలు, పోర్టులు వంటి అనేక అనుకూలతలున్న కోసలనగరం పారిశ్రామిక వాడపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. దీంతో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఉపాధి కూడా లభిస్తుంది.

చెరకు రైతుల్లో అసంతృప్తి

నిండ్ర మండలం నేతమ్స్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 2300 మంది రైతులకు 2019 క్రషింగ్‌ సీజన్‌కు సంబంధించి రూ.35 కోట్ల బిల్లులు ఆగిపోయాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు, యువగళం సమయంలో లోకేశ్‌ బకాయిలను ఇప్పించి, ఆ ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండేళ్లు కావస్తున్నా బిల్లులు అందలేదని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చెరకు రైతు సంఘం నాయకులు పలుమార్లు సీఎంను, ఎమ్మెల్యేను కలిసి సమస్యను విన్నవించినా ఫలితం లేదు.

ఉచిత విద్యుత్తు జీవోకే పరిమితం

నగరి నియోజకవర్గంలో 5500 మంది మరమగ్గాల, వంద మందికిపైగా చేనేత కార్మికులు ఉన్నారు. తమిళనాడు తరహాలో మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ సీఎంతో పలుమార్లు చర్చించారు. జీవో జారీ అయింది. ఇప్పటికి ఐదు నెలలు పూర్తయినా ఉచిత విద్యుత్తు అమలు కావడం లేదు.

టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుతో సత్ఫలితాలు

నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చాక నగరి మండలం మాంగాడులో 150 ఎకరాల్ని ఫైనల్‌ చేశారు. రైతుల నుంచి భూసేకరణ చేయకుండానే ఆ మధ్య ఇక్కడ ఎంఎ్‌సఎంఈ పార్కు అని చెప్పి ప్రారంభించేశారు. ఈ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటైతే పట్టణంలో చేనేత, మరమగ్గాల నుంచి వచ్చే కాలుష్యం తగ్గుతుంది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని మరమగ్గ కార్మికులతో పాటు పట్టణవాసులు కూడా కోరుతున్నారు.

పుత్తూరు ఆసుపత్రిని పట్టించుకోరా?

పుత్తూరు ప్రభుత్వాస్పత్రిని 30 పడకల నుంచి వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం, డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. వైసీపీ హయాంలో అప్పటి మంత్రి నారాయణస్వామి తన పరిధిలోని కార్వేటినగరం ఆస్పత్రిని 50 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేసుకున్నారు. రోజా కూడా మంత్రిగా ఉన్నప్పటికీ పుత్తూరు ఆస్పత్రిని పట్టించుకోలేదు. నగరి ఆస్పత్రి ఏళ్లుగా వంద పడకలుగానే ఉంది.

గాలేరు నగరిపై దృష్టి పెట్టండి

హంద్రీనీవా మీద ప్రత్యేక దృష్టి సారించి కుప్పానికి కృష్ణమ్మను తెచ్చిన సీఎం చంద్రబాబు.. గాలేరు నగరి సుజల స్రవంతి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పుత్తూరులో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం పూర్తయినా ఫలితం లేకుండా పోయింది.

Updated Date - Jan 24 , 2026 | 02:07 AM