Share News

మదనపల్లెలోనే ప్రశాంతత

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:45 AM

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ఒక మదనపల్లెలోనే ప్రశాంతంగా సాగుతోంది. రాయచోటి, పుంగనూరులో రెండో రోజు శనివారం కూడా ఉద్రిక్తత పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పటి వరకూ ఆ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ మినహా వైసీపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.

మదనపల్లెలోనే ప్రశాంతత
నామినేషన్‌ వేస్తున్న టీడీపీ అభ్యర్థి జి.శ్రీరామ్‌చినబాబు

మదనపల్లెలోనే ప్రశాంతత

రాయచోటి, పుంగనూరులో ఉద్రిక్తత

ఆ రెండుచోట్లా వైసీపీ నామినేషన్లు నిల్‌

మదనపల్లె, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ఒక మదనపల్లెలోనే ప్రశాంతంగా సాగుతోంది. రాయచోటి, పుంగనూరులో రెండో రోజు శనివారం కూడా ఉద్రిక్తత పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పటి వరకూ ఆ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ మినహా వైసీపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. మదనపల్లెలో ఎప్పటిలాగే రాజకీయ పార్టీలు, నేతల మధ్య సఖ్యత, స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. చిన్నపాటి ఘటనలు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఉద్రిక్తతలు, వివాదాలు లేవు. దీని కొనసాగింపుగా శనివారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక దొంతివీధిలోని నామినేషన్ల కేంద్రానికి నామినేషన్‌ వేయడానికి వచ్చిన టీడీపీ, వైసీపీ చైర్మన్‌ అభ్యర్థులు జి.శ్రీరామ్‌చినబాబు, జింకా వెంకటాచలపతి స్నేహపూర్వక వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరికొకరు ముందస్తు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇద్దరూ ఒకే వేదిక వద్ద ఆశీనులు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు..చర్చకు కూడా దారితీసింది. మదనపల్లెలో చైర్మన్‌ స్థానానికి వైసీపీ నుంచి ఏడు, టీడీపీ నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో వైసీపీ నుంచి 80, టీడీపీ నుంచి 75 నామినేషన్లు దాఖలయ్యాయి.

బీసీలకు రాజ్యాధికారం పండుగ కూడా..

ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం బీసీలకు రాజ్యాధికారం కల్పించింది. బీసీలకే కాదు..మహిళలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్రాసనం వేసింది. అదే ప్రస్తుతం మున్సిపల్‌, మండల, గ్రామాల పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమవుతోంది. బీసీలకు సాంకేతికంగా కాకపోయినా పార్టీ పరంగా కూటమి ప్రభుత్వం 34శాతం, మహిళలకు 50 శాతానికి పైగా సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించింది. నామినేషన్లు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అది కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కౌన్సిలర్‌ అభ్యర్థులే కాదు..చైర్మన్‌ అభ్యర్థులు కూడా నిరాడంబరంగా వచ్చి నామినేషన్లు దాఖలు చేయడాన్ని ఆ రెండు ఉదంతాలు గుర్తుచేస్తున్నాయి.

టీడీపీలో ఖరారు కాని అభ్యర్థులు

48 వార్డులు గల మున్సిపాలిటీలో టీడీపీలో చైర్మన్‌ అభ్యర్థి ప్రకటన మినహా, ఏయే వార్డుల్లో ఎవరు అభ్యర్థులు, ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అధిష్ఠానం ప్రకటించలేదు. ఆయా వార్డుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు రిజర్వేషన్లను బట్టి ఎవరిపాటికి వారు నామినేషన్లు వేస్తున్నారు. స్థానిక నాయకుల అభయంతో ఆశలు పెట్టుకుని ముందుకెళ్తున్నారు. అదే వైసీపీలో చైర్మన్‌ అభ్యర్థితోపాటు కౌన్సిలర్‌ అభ్యర్థులను కూడా ప్రకటించారు. అక్కడక్కడ పోటీ పడుతున్నా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం తాము అనుకున్న అభ్యర్థికే బీ-ఫామ్‌ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కూటమి పార్టీల్లోనూ గందరగోళం

మదనపల్లెలో వార్డుల కేటాయింపుపై కూటమి పార్టీల్లోనూ క్లారిటీ లేదు. టీడీపీకి 34, జనసేనకు పది, బీజేపీకి నాలుగు వార్డులు ఉంటాయని నేతలు చెబుతున్నా స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఏ వార్డులో ఎవరు పోటీ చేయాలో తెలియడం లేదు. బీజేపీ, జనసేన నేతలు తమకు అనుకూలంగా, కొంతపట్టు ఉన్న వార్డుల్లో నామినేషన్లు వేస్తున్నారు. ఇదిలావుండగా, నామినేషన్ల సందర్భంగా మొదటి రోజు రాయచోటి, పుంగనూరులోని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

Updated Date - Oct 18 , 2026 | 01:45 AM