స్నేహితుల దుర్మరణం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:56 AM
అయ్యప్పమాల ధరించి స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందారు.
అయ్యప్పమాల ధరించి మిత్రుడితో
కలిసి బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదం
రెండు గ్రామాల్లో విషాద ఛాయలు
నారాయణవనం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అయ్యప్పమాల ధరించి స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందారు. పుత్తూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పి.కన్నెప్పరెడ్డి కుమారుడు పండారం మణి(35) చెన్నైలోని ఒక కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో అయ్యప్ప భక్తులు శబరిమలై యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిసింది. దాంతో శనివారం రాత్రి చెన్నై నుంచి గ్రామానికి వచ్చాడు. ఆదివారం ఉదయం తన స్నేహితుడైన గొల్లపల్లెకి చెందిన జానకి రామయ్య కుమారుడు శ్రీనివాసులు (22)తో కలిసి నారాయణవనం మండలంలోని కైలాసనాథ కోనలో అయ్యప్ప మాలధారణ కోసం వెళ్లాడు. మాలధారణ అయ్యాక స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో నారాయణవనం పోలీస్ స్టేషన్ సమీపం పుత్తూరు-ఊత్తుకోట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ని ఢీకొంది. బైక్ నడుపుతున్న శ్రీనివాసులు తలపైకి గుర్తు తెలియని వాహన చక్రం ఎక్కడంతో ఛిద్రమై మృతి చెందాడు. అయ్యప్ప మాల ధరించిన మణి ఎగిరి రోడ్డుపక్కన పడి తీవ్రగాయాలై మృతి చెందాడు. స్నేహితులిద్దరూ మృతి చెందారని తెలియడంతో రామకృష్ణాపురం, గొల్లపల్లె గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాక బంధువులకు అప్పగించారు. మణి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.