Share News

తీర్థయాత్రలో విషాదం

ABN , Publish Date - May 16 , 2026 | 01:29 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ముగ్గురి దుర్మరణం.. ఏడుగురికి తీవ్రగాయాలు

తీర్థయాత్రలో విషాదం

పూతలపట్టు, మే 15 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు సెలవులు. కుటుంబమంతా కలిసి పుణ్యక్షేత్రాలు తిరిగొద్దామనుకున్నారు. మూడు రోజుల కిందట కర్నూలు నుంచి రెండు కార్లలో వచ్చిన వీరు.. పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం ఇంటికి వెళుతుండగా విషాదం వెన్నాడింది. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తా గణేష్‌ నగరానికి చెందిన కృష్ణ ఆర్టీసీ డ్రైవర్‌గా ఇటీవల రిటైరయ్యారు. కొడుకులు, కోడళ్లు, వారి పిల్లలతో కలిసి ఆయన రెండు కార్లలో బయలుదేరారు. రెండురోజుల క్రితం అరుణాచలం వెళ్లిన వీరు.. తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఉదయం పి.కొత్తకోట సమీపాన గల ఓ పెట్రోల్‌ బంకు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వీరి కార్లలో ఒకటి ఢీకొంది. ఆ కారులో ప్రయాణిస్తున్న సురేష్‌ భార్య రమ్యశ్రీ (36), మనోజ్‌ భార్య హేమలత (30) అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణ, ఆయన భార్య విజయలక్ష్మి, హేమంత్‌, లోహిత్‌, చార్మి, కళ్యాణ్‌, సుహస్ర, కారు డ్రైవర్‌ మనోజ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ (66) మృతిచెందారు. ఇంటి పెద్ద కృష్ణతో పాటు ఆయన కోడళ్లు రమ్యశ్రీ, హేమలత మృతిచెందడంతో మిగతా వారి రోదనలు మిన్నంటాయి.

Updated Date - May 16 , 2026 | 01:30 AM