తిరుమల ప్రయాణంలో విషాదం
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:00 AM
తిరుమలకు వెళ్తూ ముగ్గురు దుర్మరణం పాలైన ఘటనతో బంగారుపాళ్యం మండలం గుర్రంకొండవాండ్లఊరులో విషాదచాయలు అలుముకొన్నాయి.
టిప్పర్‌ను సుమో ఢీకొని ముగ్గురి దుర్మరణం
మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబీకులు
గుర్రంకొండవాండ్లఊరులో విషాదచాయలు
బంగారుపాళ్యం/చంద్రగిరి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వెళ్తూ ముగ్గురు దుర్మరణం పాలైన ఘటనతో బంగారుపాళ్యం మండలం గుర్రంకొండవాండ్లఊరులో విషాదచాయలు అలుముకొన్నాయి. పోలీసుల కథనం మేరకు చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలం, గుర్రంకొండవాండ్ల ఊరుకు చెందిన చంద్రగిరి లక్ష్మీనారాయణ(31) తన తండ్రి సిద్ధయ్య(65), చిన్నాన్న సుబ్రహ్మణ్యం, గ్రామస్తురాలైన కుప్పాల రజిని (55)తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి ఏడు గంటలకు సుమోలో గ్రామం నుంచి బయల్దేరారు. గాదంకి టోల్‌ప్లాజా దాటాక ఆరులైన్ల జాతీయ రహదారి నుంచి సింగిల్ రోడ్డులోకి వచ్చే క్రమంలో స్పీడు బ్రేకర్ల వద్ద ముందు వెళ్తున్నటిప్పర్ వేగాన్ని తగ్గించాడు. ఈక్రమంలోనే సుమో వేగంగా టిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొంది. సుమో ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. సుమో నడుపుతున్న లక్ష్మీనారాయణ, తండ్రి సిద్దయ్య, రజినిలు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలవ్వడంతో 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈప్రమాదంతో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సీఐ టీవీ సత్యనారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి, వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే గ్రామస్తులు చంద్రగిరికి, తిరుపతి రుయా ఆసుపత్రికి బయలుదేరారు. తిరుమలకు చేరకమునుపే ప్రాణాలు కోల్పోయిన వైనం గ్రామస్తులను కదిలించింది.