కనుచూపు మేరా ట్రాక్టర్లే
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:14 AM
తోతాపురి అన్‌లోడింగ్‌కోసం నిరీక్షణ
గంగాధరనెల్లూరు, ఆంధ్రజ్యోతి: చూసినంత దూరం రోడ్డు పక్కన నిలబడిన ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. తోతాపురి మామిడి కాయల లోడ్లతో రెండు కిలోమీటర్లుకు పైగా బారులుతీరాయి. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు పంచాయతీ పరిధిలోని 100 గొల్లపల్లె జైన్ ఫ్యాక్టరీ-1 వద్ద 300.. మండల కేంద్రానికి సమీపంలోని జైన్‌ఫ్యాక్టరీ -2 వద్ద 250 ట్రాక్టర్లు అన్‌లోడింగ్ కోసం వేచి ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి నిరీక్షిస్తున్నామని కొందరు రైతులు, డ్రైవర్లు బుధవారం తెలిపారు. జైన్‌ఫ్యాక్టరీ సిబ్బంది రెండు, మూడు రోజులకొకసారి రోడ్డుపైకి వచ్చి మామిడి కాయల లోడ్లతో ఉన్న ట్రాక్టర్ల నెంబర్లు నమోదు చేసుకుని, రైతుకు అన్‌లోడింగ్ నెంబర్లు కేటాయించి వెళుతున్నారు. ట్రాక్టర్లల్లోని మామిడి కాయల లోడ్లపై పట్టలు కప్పేయడంవల్ల కొంత వరకు గాలివాటం లేక కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోతాపురి మామిడికాయలు రేటువిషయంలో మాత్రం టన్ను రూ.6వేలు ఉన్నట్లు రైతులు పేర్కొన్నారు.