ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్!
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:41 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో ఏసీబీ అధికారులు తిరుపతి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నేరుగా టౌన్ ప్లానింగ్ విభాగంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న అధికారులు, సిబ్బందికి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసి అందరి సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రికార్డులు, ఫైళ్లను పరిశీలించడం ప్రారంభించారు.భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తిరుపతి కార్పొరేషన్‌లో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్,
టీడీఆర్ బాండ్ల వ్యవహారాలపై నిశిత పరిశీలన
16మంది సిబ్బంది నుంచి రూ. 35,600 సీజ్
అక్రమాల ఆధారాలు ముందే సేకరణ
నేడు కూడా కొనసాగనున్న తనిఖీలు
తిరుపతి(నేరవిభాగం), మార్చి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో ఏసీబీ అధికారులు తిరుపతి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నేరుగా టౌన్ ప్లానింగ్ విభాగంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న అధికారులు, సిబ్బందికి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసి అందరి సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రికార్డులు, ఫైళ్లను పరిశీలించడం ప్రారంభించారు.భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బీపీఎస్ అనుమతుల విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. అనుమతులకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగిన భవనాలకు కూడా బీపీఎస్ అనుమతులు మంజూరు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అలాగే నిషేధిత భూముల జాబితా (22-ఎ)లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు కూడా అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఇక టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో కూడా అక్రమాలు జరిగాయన్న అనుమానాలపై ఏసీబీ అధికారులు రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు.తిరుపతి టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన అక్రమాలపై దాడులకు ముందు కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు గోప్యంగా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఫిర్యాదుల ఆధారంగా కొన్ని అనుమానాస్పద భవనాలు, టీడీఆర్ బాండ్ల జాబితాను సిద్ధం చేసి వాటికి సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇంజనీర్లదే ప్రధాన భూమిక
టౌన్ ప్లానింగ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కొందరు అధికారులు, సిబ్బంది పాత్రపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏసీబీకి, ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు ప్రధానంగా ఇంజనీరింగ్ అధికారులపైనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ అధికారుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఏసీబీ కేంద్ర కార్యాలయం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే... తిరుపతిలో ఎవరు ఎక్కువ అనుమతులు ఇచ్చారు... అనే కోణంలో ఏసీబీ అధికారులు పరిశీలించడంతోపాటు పలువురు ఇంజనీర్ల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చే సమయానికి బయట ప్రాంతాల్లో ఉన్న కొందరు అధికారులను పిలిపించి మరీ వారి పాత్రపై ఆరా తీసినట్టు సమాచారం.
నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు, టీడీఆర్ బాండ్లకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అనుమానాస్పద భవనాలను నేరుగా పరిశీలించి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని రికార్డులతో సరిపోల్చి చూడనున్నారు. అలాగే టీడీఆర్ బాండ్ల విషయంలోనూ క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలించి జరిగిన అక్రమాలను అంచనా వేయనున్నట్టు తెలుస్తోంది.
నేడుకూడా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఆఫీసులోనే
తనిఖీలు పూర్తయ్యే వరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలోనే ఉండాలని ఏసీబీ అధికారులు సూచించినట్లు సమాచారం. తనిఖీలు బుధవారం, అవసరమైతే గురువారం కూడా కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తనిఖీలు పూర్తిగా ముగిసేవరకు విభాగం ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. కాగా టౌన్‌ప్లానింగ్ విభాగంలోని 16 మంది సిబ్బంది నుంచి 35,600 రూపాయలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం సిబ్బందిలో ఒక్కొక్కరి వద్ద రూ. 1000 ఉండవచ్చు. కాని అంతకుమించి నగదు ఉన్నవారి నుంచి అదనపు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.