తోతాపురి.. గిట్టుబాటేదీ?
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:22 AM
తోతాపురి మామిడి రైతుది మళ్లీ అదే వ్యథ. ఈ ఏడాదీ ధరలు పతనమయ్యాయి. కిలో రూ.ఆరే పలుకుతోంది. అంతకుమించి ఇవ్వలేమంటూ గుజ్జు పరిశ్రమలు చేతులెత్తేశాయి. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
పతనమవుతున్న మామిడి ధరలు
కిలో రూ.ఆరుకు మించి ఇవ్వలేమన్న గుజ్జు పరిశ్రమలు
ఆవేదనలో రైతులు
తోతాపురి మామిడి రైతుది మళ్లీ అదే వ్యథ. ఈ ఏడాదీ ధరలు పతనమయ్యాయి. కిలో రూ.ఆరే పలుకుతోంది. అంతకుమించి ఇవ్వలేమంటూ గుజ్జు పరిశ్రమలు చేతులెత్తేశాయి. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
- విజయపురం, ఆంధ్రజ్యోతి
విజయపురం మండలంలో సుమారు 1850 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. వీటిలో సింధూర, తోతాపురి, బంగినపల్లి, కాలేపాడు, ఖాదర్, నీలం వంటి రకాలున్నాయి. ఈ మామిడి కాయలను చెన్నైలోని కోయంబేడు, తిరువళ్లూరు, తిరుత్తణి, తిరుపతి, బెంగళూరు, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో పూత రాకపోవడంతో రెండు, మూడుసార్లు మందులు పిచికారి చేశారు. ఆశించిన స్థాయిలో పూత వచ్చినా కాయలు నిలవకుండా రాలిపోయింది. దీంతో 50 శాతం దిగుబడి వచ్చినా గాలివాన బీభత్సానికి చాలావరకు మామిడి కాయలు రాలిపోయాయి. మిగిలిన తోతాపురి రకం కాయలు.. పక్వానికి రాగానే గుజ్జు పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా మామిడి కాయల ధరలు పతనమయ్యాయి. సింధూర టన్ను రూ.8- 9 వేలు, తోతాపురి రూ.6 వేలు, బంగినపల్లి రూ. 15-20 వేలకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్యాక్టరీ యజమానులు సిండికేట్ అయి తోతాపురి రకాన్ని టన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలు మధ్యలోనే నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా జ్యూస్ ఫ్యాక్టరీలో ధరలు పతనం కావడంతో మామిడి రైతులు తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు, చెన్నైలోని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడానికి చొరవ చూపారు. దినసరి మార్కెట్‌లో అమ్ముకునే వ్యాపారుల వద్దకెళ్లి రోజువారీ మామిడి కాయలు సరఫరా చేస్తామని రైతులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సింధూర రకాన్ని ప్రైవేటు వర్తకులు టన్ను రూ.12 వేలు, బంగినపల్లి రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే, వాళ్లు పెద్దమొత్తంలో కాకుండా, కొంచెమే కొనుగోలు చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రతి రోజూ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది.
ఎకరా సాగుకు ఖర్చు రూ.30 వేలు
ఎకరాలో మామిడి తోట సాగు చేయడానికి రూ.30 వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. మూడు పర్యాలు మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే దుక్కి దున్నడం, పురుగు మందులు నిమిత్తం ఖర్చులు చేస్తున్నామని వాపోతున్నారు. మామిడిలో ఎక్కువ మంది కౌలు రైతులున్నారు. వారికి ఎకరాకు రూ. 15 వేల వరకు అదనం.
ఏమాత్రం గిట్టుబాటు కాదు
తోతాపురి రకం టన్ను రూ.6 వేలకు మించి కొనలేమని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని గుజ్జు పరిశ్రమలు చెప్పేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము మామిడి కాయలు కోసి, లోడ్ చేసి, గుజ్జు పరిశ్రమకు తరలించడానకి టన్నుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చవుతోందన్నారు. ఇక, మందులు పిచికారి, సస్యరక్షణ కోసం పెట్టిన పెట్టుబడి కలిపితే.. ఈ సంవత్సరం కూడా తమకు నష్టాలే మిగులుతున్నాయంటూ బుధవారం కోసలనగరంలో రైతులు నిరసన తెలిపారు.
ప్రభుత్వమే అదుకోవాలి
ఏడాదిగా కష్టపడి సాగు చేస్తే ప్రారంభంలోనే గుజ్జు పరిశ్రమలు టన్ను రూ.6 వేలు ధర నిర్ణయించాయి. దిగుబడి 50 శాతం వస్తే రెండు పర్యాయాలు గాలి బీభత్సానికి రాలి పోయాయి. ఉన్న మామిడిని కూడా మంచి ధరకు అమ్ముకోలేక నష్టపోతున్నాం. మమ్మల్ని ప్రభుత్వమే అదుకోవాలి.
- వెంకటరమణ, మామిడి రైతు, కేశవపురం
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ప్రారంభంలో పూత కనిపించినా మొత్తం రాలిపోయింది. రెండేళ్లపాటు నష్టమే చూస్తున్నాం. ఈ క్రమంలో మండల కేంద్రంలో మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే మామిడి ధర నిర్ణయించి కొనుగోలు చేయాలి.
- వెంకట్రాజు, మిట్టూరు