ఆశాజనకంగా టమోటా ధరలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:41 AM
పలమనేరు మార్కెట్‌లో మూడు రోజులుగా టమోటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రోజూ ధరలు పెరుగుతుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. రెండేళ్లుగా టమోటా సాగు చేసిన రైతులు ధరల్లేక నష్టపోయారు. ఒక దశలో టమోటాలను జాతీయ రహదారుల వెంబడి పారబోసిన ఘటనలు ఉన్నాయి. రెండేళ్లుగా వర్షాలు సమయానికి కురుస్తుండడంతో వేలాది ఎకరాల్లో టమోటా సాగుకు పూనుకున్నారు. దీంతో ఒక్కసారిగా టమోటా దిగుబడులు పెరిగి దాదాపు ఏడాదిన్నర పాటు టమోటా బాక్సు ధర రూ.150 నుంచి రూ.180కే పరిమితమైంది. దీంతో రైతులు అప్పులపాలయ్యారు. అయినా కొందరు రైతులు టమోటా సాగు కొనసాగించారు
పలమనేరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): పలమనేరు మార్కెట్‌లో మూడు రోజులుగా టమోటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రోజూ ధరలు పెరుగుతుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. రెండేళ్లుగా టమోటా సాగు చేసిన రైతులు ధరల్లేక నష్టపోయారు. ఒక దశలో టమోటాలను జాతీయ రహదారుల వెంబడి పారబోసిన ఘటనలు ఉన్నాయి. రెండేళ్లుగా వర్షాలు సమయానికి కురుస్తుండడంతో వేలాది ఎకరాల్లో టమోటా సాగుకు పూనుకున్నారు. దీంతో ఒక్కసారిగా టమోటా దిగుబడులు పెరిగి దాదాపు ఏడాదిన్నర పాటు టమోటా బాక్సు ధర రూ.150 నుంచి రూ.180కే పరిమితమైంది. దీంతో రైతులు అప్పులపాలయ్యారు. అయినా కొందరు రైతులు టమోటా సాగు కొనసాగించారు. వారం రోజులుగా పలమనేరు మార్కెట్‌లో 15 కిలోల బాక్సు ధర రూ.300నుంచి క్రమేపి పెరుగుతూ శుక్రవారం గరిష్ఠంగా రూ.500 చేరుకుంది. నెల రోజులుగా ఎండలు తీవ్రస్థాయిలో మండుతుండటంతో టమోటా తోటల్లో పూత నిలవడం లేదని రైతులు అంటున్నారు. దీంతో దిగుబడి తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. అంతేకాక చెన్నె పరిసర ప్రాంతాల్లోనూ టమోటా దిగుబడులు లేక డిమాండు పెరిగిందని తెలిసింది. తమిళనాడులో ఎన్నికల కారణంగా టమోటా లారీలు చెన్నె వెళ్లేందుకు తనిఖీల పేరుతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎన్నికలు ముగియడంతో చెన్నెకు పెద్ద సంఖ్యలో లారీల్లో టమోటాలను తీసుకెళ్తుండటంతో డిమాండు పెరిగి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.