Share News

టమోటా ధరలు కాస్త పైకి..!

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:01 AM

టమోటా ధరలు పది రోజుల తరువాత నామమాత్రంగా పెరిగాయి. పలమనేరు మార్కెట్‌ యార్డులో ఫిబ్రవరి ఒకటి నుంచి 15కిలోల బాక్సు రూ.150కే పరిమితమవుతూ వచ్చింది. రెండు రోజులుగా ఈ ధరలు రూ.220నుంచి గరిష్ఠంగా రూ.230 పలుకుతున్నాయి.

టమోటా ధరలు కాస్త పైకి..!

పలమనేరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): టమోటా ధరలు పది రోజుల తరువాత నామమాత్రంగా పెరిగాయి. పలమనేరు మార్కెట్‌ యార్డులో ఫిబ్రవరి ఒకటి నుంచి 15కిలోల బాక్సు రూ.150కే పరిమితమవుతూ వచ్చింది. రెండు రోజులుగా ఈ ధరలు రూ.220నుంచి గరిష్ఠంగా రూ.230 పలుకుతున్నాయి. ఈ ఏడాది టమోటా సాగు చేసిన రైతులకు కనీసం కూలి డబ్బులు కూడా రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. ఎకరా సాగు చేయాలంటే కనీసం రూ.లక్షనుంచి రూ.1.5 లక్షల మేర వ్యయమవుతోంది. ఇటీవల టమోటాలకు సైతం ఊజీ పురుగు ఆశిస్తుండటంతో పాటు వివిధరకాల చీడపీడల నివారణకు రైతులు క్రిమిసంహారక మందులు ఎడతెరపి లేకుండా పిచికారీ చేయాల్సి వస్తోంది. బాక్సు టమోటా తోటలో కోయాలంటే కనీసం రూ.10 అవుతోంది. ఇక తోట నుంచి మార్కెట్‌కు తరలించాలంటే బాక్సుకు దూరం బట్టి రూ. 10నుంచి రూ.15మేర భరించాలి. ఇక మార్కెట్‌యార్డులో మండీ వ్యాపారులకు అమ్మిన టమోటా మొత్తంలో 10 శాతం కమీషన్‌ చెల్లించాలి. అంటే ఒక బాక్సు టమోటా ధర రూ. 150 పలికితే అందులో కనీసం రూ.35నుంచి రూ40 వరకు రైతుల చేతికి రాదు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి మాట దేవుడెరుగు కూలీలు, క్రిమి సంహారక మందుల ఖర్చులకు కూడా రావడంలేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 02:01 AM