50 ఎకరాల్లో టమోటా మార్కెట్ అభివృద్ధి
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:49 AM
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
మదనపల్లె టౌన్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మదనపల్లె నడిబొడ్డున ఉన్న టమోటా మార్కెట్‌ను పట్టణం వెలుపల 50 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడికి మార్చేందుకు చర్యలు తీసుకుంటామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దినకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. పీఎం ధనధాన్య కృషి యోజన పథకం కింద జిల్లా ఎంపికైన విషయాన్ని గుర్తుచేశారు. టమోటకు గిట్టుబాటు ధరలు కల్పించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉపాధి పథకంలో నిజమైన వేతనదారులకు న్యాయం జరిగేలా వీబీ జీరామ్‌జీ పథకం తీసుకొస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో జలజీవన్ మిషన్, అమృత్, పీఎం సూర్యఘర్ అమలులో అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం దినకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో 100 జిల్లాలను వ్యవసాయం రంగంలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాకు బడ్జెట్‌లో రూ.240 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నీరుగట్టువారిపల్లెతో పాటు చౌడేశ్వరీనగర్-1లోని రాజారాజేశ్వరి సిల్స్ యూనిట్‌ను దినకర్ పరిశీలించారు.