టమోటా రైతుల ఆగ్రహం
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:08 AM
గిట్టుబాటు ధర లభించడం లేదంటూ పలమనేరులోని మార్కెట్‌యార్డు వద్ద శుక్రవారం టమోటా రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం వీరు మార్కెట్‌యార్డు ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.
గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన
మార్కెట్‌యార్డు గేట్ల మూసివేత
పలమనేరు, జూలై3(ఆంధ్రజ్యోతి) : గిట్టుబాటు ధర లభించడం లేదంటూ పలమనేరులోని మార్కెట్‌యార్డు వద్ద శుక్రవారం టమోటా రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం వీరు మార్కెట్‌యార్డు ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. యార్డుకున్న రెండు గేట్లు మూసివేసి, వాహనాలను అడ్డుపెట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవకుమార్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మార్కెట్‌యార్డులో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టమోటాకు సరైన ధర లేకుండా చేశారని ఆగ్రహించారు. పొరుగు మార్కెట్ యార్డులతో పోల్చితే బాక్సుకు రూ.30 తేడా ఉంటోందన్నారు. రెండేళ్లుగా టమోటాలకు ధరలు లేక అప్పులు పాలవుతున్నామని వాపోయారు. ఇక్కడ వ్యాపారుల వైఖరే ఽధరల పతనానికి కారణమని విమర్శించారు. మార్కెట్‌యార్డు చెర్మన్ రాజన్న స్థానికంగా లేరని, సోమవారం రైతులతో సమావేశం నిర్వహిస్తామని కార్యదర్శి చెప్పడంతో ఆందోళన విరమించారు. దాదాపు 2గంటల పాటు వీరు బైఠాయించడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి రైతులను మార్కెట్‌యార్డు లోపలికి పంపించారు.